జురాసిక్‌పార్క్‌తో మొదలైన హవా...
మూడు దశాబ్దాలుగా 20 సినిమాలకు పైగా...
వందల కోట్లకు చేరిన విదేశీ చిత్రాల కలెక్షన్లు
తాజాగా ‘ది ఒడిస్సీ, స్పైడర్‌మ్యాన్’ చిత్రాల జోరు
ఒకప్పుడు హాలీవుడ్ సినిమా అంటే దేశంలోని మెట్రో నగరాల్లోని ఇంగ్లిష్ ప్రేక్షకులకే పరిమితమైన వినోదం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ సినిమాలు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ భారతీయ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. తాజాగా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ ఆ వెంటనే వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒకటి తర్వాత ఒకటి భారత బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటడంతో ఇండియన్ మార్కెట్‌లో హాలీవుడ్ సినిమాల హవా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ జోరుకు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే బీజం పడింది. భారతీయ హాలీవుడ్ మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చిన సినిమా... స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘జురాసిక్‌పార్క్’..
డైనోసార్ల దాడితో... మొదలైన విప్లవం
‘జురాసిక్‌పార్క్’ 1994లో విడుదలై, భారతదేశంలో హాలీవుడ్ సినిమాల భారీ మార్కెట్‌కు బలమైన పునాది వేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు ‘మెకన్నాస్ గోల్డ్’ (1969), బ్రూస్ లీ నటించినన ‘ఎంటర్ ది డ్రాగన్’ (1975) వంటి విదేశీ సినిమాలు భారతీయ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందినా కలెక్షన్ల సంచలనాలకు మాత్రం డైనోసార్లే కారణం. మెట్రో నగరాలను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి దాదాపు రూ. 19 కోట్ల వసూళ్లు సాధించి, భారతదేశంలో హాలీవుడ్ సినిమాలకు భారీ మార్కెట్ ఉందని నిరూపించిన విదేశీ సినిమా ‘జురాసిక్‌పార్క్’ తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించగలదని నిరూపిస్తూ చిన్న పట్టణాల్లోని ప్రేక్షకులకూ హాలీవుడ్ సినిమాను చేరువ చేసింది.
మునిగిన ‘టైటానిక్’తో పెరిగిన హవా...
‘జురాసిక్‌పార్క్’ వేసిన బాటను 1998లో జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ అందిపుచ్చుకుంది. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ జంటగా నటించిన ఈ ప్రేమకథ భారతదేశంలో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హాలీవుడ్ చిత్రంగా ఒక కొత్త మైలురాయిని నెలకొల్పింది. డైనోసార్లు, భారీ యాక్షన్ చిత్రాలే కాదు ప్రేమకథ కూడా మన దేశంలో హాలీవుడ్ సినిమాకు భారీ సంఖ్యలో ప్రేక్షకులను తీసుకురాగలదని ఈ సినిమా నిరూపించింది. ఆ తర్వాత దశలవారీగా భారీ విజువల్స్, సూపర్ హీరోలు, అద్భుతమైన యాక్షన్, ప్రపంచస్థాయి సాంకేతికతతో వస్తున్న హాలీవుడ్ చిత్రాలకు మన దేశంలో భారీ మార్కెట్ ఏర్పడింది. అయితే అందుబాటులో ఉన్న కలెక్షన్ల గణాంకాల ప్రకారం చూస్తే గత దశాబ్ద కాలంగా ఈ హవా మరింత పెరగడం కనిపిస్తోంది.
‘అవతార్’దే అగ్రస్థానం
భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అగ్రస్థానంలో ఉంది. గత 2022లో విడుదలైన ఈ జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ భారత్‌లో సుమారు రూ. 378 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కొన్ని బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థల తాజా లెక్కల్లో నెట్ వసూళ్లు రూ. 390 కోట్లకు పైగానే నమోదయ్యాయి.
మార్వెల్ మేనియా
ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల విజయానికి మరో కొత్త ఫార్ములా వచ్చింది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన అవెంజర్స్: ఇని్ఫనిటీ వార్, రూ. 227 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇక్కడ సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన అవెంజర్స్: ఎండ్ గేమ్’ ఇండియన్ బాక్సాఫీస్‌పై సునామీలా విరుచుకుపడింది.
ఆ సినిమా విడుదలకు ముందే టికెట్లకు ఏర్పడిన డిమాండ్, తొలి రోజుల్లో థియేటర్ల వద్ద కనిపించిన అభిమానుల సందడి... హాలీవుడ్ సినిమాలకు భారత్‌లో ఏర్పడిన క్రేజ్‌ని తేల్చి చెప్పాయి. 2019లో విడుదలైన ఈ చిత్రం భారతదేశంలో సుమారు రూ. 373 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో నిరూపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లపై సినీ పండితుల అంచనాలను ఇది తలకిందులు చేసింది.
సూపర్ హీరో దెబ్బకు బాక్సాఫీస్ షేక్...
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు భారతీయ ప్రేక్షకుల్లో భారీ అభిమానగణం ఏర్పడింది. టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ చిత్రం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.పాత స్పైడర్‌మ్యాన్‌పాత్రలను కూడా కథలోకి తీసుకురావడం అభిమానులను థియేటర్లకు భారీగా రప్పించింది. తాజాగా వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కూడా ఇండియాలో అసాధారణ వేగంతో దూసుకెళ్లింది. రెండో వారానికే భారతదేశంలో రూ. 530 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్లు తాజా ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి.
పిల్లలకే కాదు... పెద్దలకూ ‘జంగిల్ బుక్’
గత 2016లో వచ్చిన ‘ది జంగిల్ బుక్’ భారతదేశంలో హాలీవుడ్ సినిమాల మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రుడ్‌యార్డ్ కిప్లింగ్ కథను డిస్నీ అద్భుతమైన విజువల్స్‌తో తెరపైకి తీసుకురావడంతో పిల్లలతోపాటు కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఈ చిత్రం భారత్‌లో సుమారు రూ. 188 కోట్ల వసూళ్లు సాధించింది. డిస్నీ రూ పొందించిన ‘ది లయన్ కింగ్’ కూడా భారత బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. గత 2019లో విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 159 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. యానిమేషన్ సినిమాలకు కూడా భారతదేశంలో ఎంతటి మార్కెట్ ఉందో ఇది చూపించింది.
నోలన్... ఆ పేరే చాలు...
భారత దేశంలో క్రిస్టోఫర్ నోలన్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘ఇన్‌సెప్షన్’, ‘డన్‌కిర్క్’, ‘ఓపెన్‌హైమర్’ సినిమాలతో ఆయనకు ఇండియాలో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ముఖ్యంగా ‘ఓపెన్‌హైమర్’ భారతదేశంలో రూ. 100 కోట్ల మార్క్ దాటిన తర్వాత, తాజా ‘ది ఒడిస్సీ’ కూడా అదే మైలు రాయిని అందుకోవడంతో ఆ ఘనత సాధించిన తొలి విదేశీ దర్శకుడుగా ఆయన నిలిచారు.
హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా రూ పొందిన ఈ సినిమాలో మాట్ డేమన్, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, అన్నే హాత్‌వే తదితర భారీ తారాగణం నటించారు. గత జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారతదేశంలోనూ భారీ స్పందన అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన నోలన్ చిత్రంగా నిలిచింది.
విస్తరిస్తున్న టెక్నాలజీ... విదేశీ క్రేజీ...
భారతదేశంలో హాలీవుడ్ సినిమాల విజయానికి కేవలం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం ఉన్న ప్రేక్షకులే కారణం కాదు. డబ్బింగ్ మార్కెట్ విస్తరించడం, ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు ఒకేసారి విడుదల కావడం, మల్టీప్లెక్స్‌ల పెరుగుదల, ఐమ్యాక్స్, 3డీ వంటి ప్రీమియం ఫార్మాట్లకు పెరిగిన ఆదరణ, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఏర్పడుతున్న హైప్... ఇవన్నీ కలిసి హాలీవుడ్‌కు భారత్‌ను కీలక మార్కెట్‌గా మార్చాయి. అలాగే మార్వెల్, డీసీ, ‘అవతార్’, ‘జురాసిక్ వరల్డ్’, ‘మిషన్: ఇంపాజిబుల్’, ‘స్పైడర్‌మ్యాన్’ వంటి ఫ్రాంచైజీలకు ఇప్పటికే ఏర్పడిన బ్రాండ్ విలువ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.


