అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న 'MAGA' అంతర్గత పోరు! | Maga civil war in Trump's party, What Next? | Sakshi
Sakshi News home page

అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న 'MAGA' అంతర్గత పోరు!

Aug 17 2026 5:34 PM | Updated on Aug 17 2026 5:49 PM

Maga civil war in Trump's party, What Next?

అమెరికా అధ్యక్ష పీఠం కోసం 2028లో జరగనున్న ప్రైమరీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది..! అయితే, అప్పుడే అమెరికా రాజకీయాల్లో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 'MAGA' (Make America Great Again) ఉద్యమంలో ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధం రాజుకుంది. విదేశాంగ విధానం, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం, భవిష్యత్తులో అమెరికా సైనిక జోక్యం వంటి కీలక అంశాలపై ట్రంప్ పరిపాలనలో మరియు రిపబ్లికన్ పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. దాంతో.. ట్రంప్ రాజకీయ వారసుడు ఎవరవుతారనే దానిపై ఈ పోరు కేంద్రంగా ఉంది.

వాన్స్‌వైపు ట్రంప్ మొగ్గు..!
తన తర్వాత ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ (JD Vance) తన వారసుడిగా రావాలని ట్రంప్ ప్రైవేట్‌గా డోనర్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ట్రంప్ వాన్స్‌ను అధికారికంగా ఎండార్స్ చేయకపోవడం వల్ల.. మితవాద రిపబ్లికన్లలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో(Marco Rubio) 2028లో ట్రంప్ వారసుడిగా నిలుస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ రైట్ ప్రభావం - కొత్త సమీకరణాలు
ఆన్‌లైన్ రైట్ వర్గాల ప్రభావం ఈ రాజకీయ సమీకరణాలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ టక్కర్ కార్ల్సన్(Tucker Carlson) భవిష్యత్తులో మూడో పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగే సూచనలు చేస్తున్నారు. మరోవైపు, నిక్ ఫ్యూంటెస్ వంటివారు కూడా యువతను ఆకట్టుకునేలా MAGA ఉద్యమానికి తమదైన తీవ్రరూపాన్ని ఇస్తున్నారు.

రెండు వర్గాల పోరు
2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. ట్రంప్ తర్వాత MAGA సిద్ధాంతాన్ని ఏది శాసించాలనే విషయంలో రిపబ్లికన్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా రెండు శిబిరాలు ఉన్నాయి:

నియోకన్జర్వేటివ్ (Neoconservative) వర్గం: సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు, ఉక్రెయిన్‌కు బలమైన మద్దతు ఇవ్వాలని, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలలో అమెరికా సైన్యాన్ని దూకుడుగా ఉపయోగించాలని వీరు కోరుకుంటారు.

యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ (Anti-interventionist) వర్గం: ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. నాటో మిత్రదేశాలు, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించాలని, ఇరాన్‌తో సైనిక చర్య కంటే దౌత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు.

ట్రంప్ ఈ రెండు భిన్నమైన విదేశాంగ విధానాలను తన పాలనలో మిక్స్ చేసి అమలు చేయడానికి ప్రయత్నించారు. మార్కో రూబియోను వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి అనుమతించడం ద్వారా నియోకాన్లకు ఒక విజయాన్ని అందించారు. అదే సమయంలో ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లినప్పటికీ, జూన్ నుంచి ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపే బాధ్యతను జె.డి.వాన్స్‌కు అప్పగించారు. ఇలా రెండు వైపులా అవకాశాలు ఇవ్వడం వల్ల MAGA అధికారిక విధానం ఏమిటనే దానిపై పార్టీలో మరింత గందరగోళం పెరిగింది.

ఓటర్లలో ‘తరాల’వారీగా చీలిక
ఈ సైద్ధాంతిక విభేదాలు కేవలం నాయకుల మధ్యే కాకుండా ఓటర్లలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ ప్రకారం.. 50 ఏళ్లు పైబడిన రిపబ్లికన్లలో 63% మంది విదేశాంగ విధానంలో అమెరికా మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. కానీ 50 ఏళ్ల లోపు యువ రిపబ్లికన్లలో కేవలం 38% మంది మాత్రమే దీనికి మద్దతు ఇస్తున్నారు. పెద్ద వయసు వారిలో నియోకన్జర్వేటివ్ ఆలోచనలు, యువతలో సైనిక జోక్య వ్యతిరేక (Anti-interventionist) భావనలు బలంగా ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోంది.

వాన్స్‌ ఎదుట ఉన్న సవాళ్లివే..!
2028 ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలవాలనుకుంటున్న జె.డి.వాన్స్‌కు టక్కర్ కార్ల్సన్, నిక్ ఫ్యూంటెస్ వంటి వారి ప్రభావం పెద్ద తలనొప్పిగా మారుతోంది.

టక్కర్ కార్ల్సన్ మూడో పార్టీ ప్రయత్నాలు: కార్ల్సన్ యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ ఎజెండాతో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మార్జరీ టేలర్ గ్రీన్, థామస్ మాస్సీ వంటి మాజీ ట్రంప్ మద్దతుదారులతో సమావేశమై 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్ల్సన్ ప్రత్యక్షంగా మూడో పార్టీ పెట్టినా పెట్టకపోయినా.. MAGA ఓటర్లను చీల్చడం ద్వారా వాన్స్ అవకాశాలను దెబ్బతీయగలరు.

నిక్ ఫ్యూంటెస్ ప్రభావం: వైట్ నేషనలిస్ట్ అయిన నిక్ ఫ్యూంటెస్ యువ రిపబ్లికన్ స్టాఫ్‌పై ప్రభావం చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి థింక్ ట్యాంకుల వరకు అనేక మంది యువ ఉద్యోగులు ఫ్యూంటెస్ భావనలకు ఆకర్షితులవుతున్నారు. వాన్స్ తన భార్యపై జాతిపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఫ్యూంటెస్‌ను విమర్శించారు. అయితే.. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం నియోకాన్లు, బెన్ షాపిరో వంటి వారి ఆగ్రహానికి కారణమవుతోంది.

టక్కర్ కార్ల్సన్ రాజకీయ ఆకర్షణ కావచ్చు, లేదా నిక్ ఫ్యూంటెస్ వివాదాస్పద నేపథ్యం కావచ్చు.. అంతర్గత కుమ్ములాటలు 2028 అధ్యక్ష రేసుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఒకవైపు పార్టీని ఏకం చేస్తూనే, మరోవైపు మారుతున్న ఈ రాజకీయ సమీక్షలను జేడీ వాన్స్ ఎలా ఎదుర్కొంటారనేది రాబోయే కాలంలో అమెరికా రాజకీయాల గమనాన్ని నిర్దేశిస్తుందనేది నిర్వివాదాంశం..!
-సాక్షి వెబ్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement