వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒమన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధంలో ఒమన్ గనుక తలదూర్చితే వారిపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు జరిగే ఈ అత్యంత కీలకమైన జలసంధిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌తో కలిసి ఒమన్ దేశం ఒక ఒప్పందానికి వస్తోందని, ఆ జలసంధి నిర్వహణ లేదా టోల్స్ వసూలు బాధ్యతలను ఇరాన్‌తో కలిసి పంచుకుంటుందనే ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ ఆ దేశంపై రెచ్చిపోయారు.
ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ వెంటనే లొంగిపోవాలి, శ్వేత పతాకాన్ని ఎగరవేయాలి.ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదు. అదే అమెరికా ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఈ అంశంలో ఒమన్ కనుక మా దారికి అడ్డువస్తే, వారిపై తీవ్రమైన దాడులు చేస్తాం" అని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్ దౌత్యవేత్తలతో ఒమన్ అధికారులు ఇటీవల చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు.
కాగా అమెరికా, ఇరాన్ మధ్య (జూన్ 17న) 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని తెరవడం, శాంతి చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ 60 రోజుల గడువు ముగిసే సమయానికి ఇరు దేశాల మధ్య భద్రతా హామీలు, నౌకా ప్రయాణ స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళన పెంచుతున్నాయి.


