టాక్సిక్‌ కామెంట్స్‌...  ఇంకెంత కాలం? | Safeguarding Womens Self-Respect in the Digital Age | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ కామెంట్స్‌...  ఇంకెంత కాలం?

Aug 7 2026 1:54 AM | Updated on Aug 7 2026 1:54 AM

Safeguarding Womens Self-Respect in the Digital Age

సందర్భం

ఆమె ఒలింపిక్స్‌లో పతకం తెచ్చినా కంపెనీకి సీఈవో అయినా అసెంబ్లీలో ప్రజల తరపు మాట్లాడినా సినిమాలో నటించినా...సమాజం మొదట చూసేది టాలెంట్‌ను కాదు. ఆమె డ్రెస్, లుక్స్, వ్యక్తిగత జీవితం... తాజాగా ఒక సీనియర్‌ నటిపై పబ్లిక్‌ వేదిక నుంచి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు మళ్లీ చర్చ రాజేసాయి. డిజిటల్‌ యుగంలో మహిళలకు  ‘ఆత్మగౌరవ రక్షణ’ ఎలా?  టాక్సిక్‌ కామెంట్స్‌కు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు?

ఒక మగాడు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు. అదే గమ్యానికి స్త్రీ చేరాలంటే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాలి. దారంతా సవాళ్లు, ప్రతిబంధకాలు, వివక్ష, కన్నీరు, కష్టం. ఇంతా చేసి ఆమె లైమ్‌లైట్‌లోకి రాగానే ఆ కష్టమంతా పక్కకు పోయి ఆమె ‘స్త్రీ’ అన్న విషయం మాత్రమే ముందుకు వస్తుంది. ఇక ఆమె గురించి గాసిప్, ట్రోల్, బాడీ షేమింగ్‌ మొదలైపోతాయి. రాజకీయాల్లో ఉన్న స్త్రీ అయితే వ్యక్తిగత దూషణ.

 క్రీడల్లో విజేత అయితే దుస్తులపై చర్చ. బోర్డ్‌రూమ్‌లో రూల్‌ చేస్తే ‘ఎవరి సిఫార్సు’ అనే అనుమానం. ఇక వెండితెర హీరోయిన్‌ అయితే ఏమైనా వాగొచ్చు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ నటిపైనే పొరుగు రాష్ట్రంలో ఇటీవల వ్యాఖ్యలు వింటున్నాం. ఇక సామాన్య మహిళ పరిస్థితి ఏంటి? చట్టాలు వచ్చాయి, శిక్షలు పడుతున్నాయి. కానీ మనుషుల ఆలోచన, నోటి తీట మాత్రం మారడం లేదు.

చాటుముఖంతో దాడి
ఒకప్పుడు విమర్శ అంటే పత్రికలో లేఖ, సభలో ప్రసంగం. అందులోనూ ఒక హద్దు ఉండేది. ఇప్పుడు చేతిలో ఫోన్, ఫేక్‌ ఐడీ ఉంటే చాలు. ఎవరైనా జడ్జ్‌ అయిపోతున్నారు. ఫేక్‌ పేరుతో ట్రోలింగ్, బాడీ షేమింగ్, అసభ్య కామెంట్స్‌. లక్షల మంది ఫాలోవర్లు ఉన్నా, ఒకే ఒక్క టాక్సిక్‌ కామెంట్‌ ఆమె రోజుని నాశనం చేస్తుంది. పబ్లిక్‌ ఫిగర్‌గా ఆమె ఏదైనా మాట్లాడిన తర్వాత సోషల్‌ మీడియాలో ఆమెపై దాడి మరింత పెరుగుతుంది. 

ఆమె చేసిన కృషి కంటే వేసుకున్న చీర, పెళ్లి, వయసు గురించే చర్చ. ఇది మాటల దాడి కాదు. ఇది ‘డిజిటల్‌ హత్య’. నేషనల్‌ క్రై మ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2024లో సైబర్‌ క్రైమ్‌లో 60% బాధితులు మహిళలే. అందులో ఎక్కువ శాతం పబ్లిక్‌ ఫిగర్స్‌. సోషల్‌ మీడియా ఇచ్చిన ఫ్రీడం మహిళలకు పాలిటి పీడగా మారింది. బ్లాక్‌ చేసినా, రిపోర్ట్‌ చేసినా ఆ గాయం మిగిలే ఉంటుంది.

పవర్‌ చైర్‌పై లింగ వివక్ష 
ఒక మహిళ లీడర్‌గా ఎదుగుతుంటే ఈ సమాజం ఎందుకు జీర్ణించుకోలేకపోతోంది? విధానాలపైనే గొడవ పడాలి. కానీ జరుగుతోంది ఏంటి? ఆమె నడక, నవ్వు, మేకప్‌ టార్గెట్‌. పురుష నేతను ఎవరూ ‘వ్యక్తిగతం’ గురించి అడగరు. కానీ మహిళా మంత్రి చుట్టూ నిఘాయే. కంపెనీ సీఈవో అంటే ‘కోటా’ అంటారు. బోర్డ్‌రూమ్‌లో ప్రెజెంటేషన్‌ ఇస్తున్నప్పుడు ఆమె ఐడియా కంటే ఆమె డ్రెస్‌ గురించి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే ఎమ్మెల్యేను ఆమె క్యారెక్టర్‌తో కలుపుతారు. ప్రతిభకు బదులు జెండర్‌ను చూసే ఈ మైండ్‌సెట్‌ మారనంత వరకు బోర్డ్‌రూమ్‌లోనూ, అసెంబ్లీలోనూ మహిళలు ఇంకా ఫైట్‌ చేయాల్సిందే.

మెడల్‌ కంటే మేకప్‌ ముఖ్యమా? 
మైదానంలో దేశం కోసం పరిగెత్తే అమ్మాయి. కాని ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో మనం డిసైడ్‌ చేస్తాం. క్రీజ్‌లో సిక్సర్‌ కొట్టిన అమ్మాయి.. కాని మనం ఆమె జిమ్‌ డ్రెస్‌ను వైరల్‌ చేస్తాం. వీరికి రాజకీయ అభి్రపాయాలు, భిన్నమైన అభి్రపాయాలు ఉండటానికి వీల్లేదు. వర్తమాన విషయాల మీద మాట్లాడితే గేలి చేస్తారు. ‘నీ కూతురిని...’ అంటూ భయభ్రాంతం చేస్తారు. ఇవన్నీ చూసి టాప్‌లో ఉన్న హీరోయిన్లు, క్రీడాకారిణులు కూడా డిప్రెషన్ కు వెళ్తున్నారు. మర్యాద అంటూ పూర్తిగా తప్పింది. ఒకప్పుడు అభిమానించే హీరోయిన్ ను ఇప్పుడు మీమ్స్‌లో, ట్రోల్స్‌లో వాడి సీరియెస్‌నెస్‌ను తీసేస్తున్నారు.

పబ్లిక్‌ లైఫ్‌లో మహిళలకు కావాల్సింది పోలీసు భద్రత ఒక్కటే కాదు. మానసిక భద్రత, డిజిటల్‌ భద్రత కూడా. చట్టాలు శిక్ష వేయగలవు. కానీ గౌరవాన్ని చట్టంతో తీసుకురాలేము. పలుకుబడి ఉన్న నేతలు కూడా మాట తూలుతూ ఉంటే యువతకు కంట్రోల్‌ ఉంటుందా? ట్రోల్‌ చేసేవాడు, సభలో నోరు జారే నాయకుడు... ఇంట్లో తల్లి, చెల్లి, భార్యను ఎలా చూస్తాడు? అదే అసలు ప్రశ్న. ఇప్పటికైనా మనం మన ‘కంటి కాలుష్యం’, ‘మైండ్‌ టాక్సిసిటీ’ని కడుక్కోవాలి. మహిళను ‘ఒక శరీరం’గా కాకుండా ‘ఒక సమర్థురాలైన వ్యక్తి’గా చూసిన రోజు... అదే అసలైన ప్రగతి. ఇంకా ఎంతకాలం ఈ ట్రోల్‌ రాజ్యం? 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement