బట్టతల బాధితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి రకరకాల తైలాలు, ఔషధ లేపనాలు రాసుకుంటూ ఎంతకూ రాని జుట్టుకోసం ఎదురు చూస్తుంటారు. ఇకపై బట్టతల బాధితులకు అలాంటి తంటాలు ఉండవు. బట్టతలపై జుట్టు మొలిపించే ఔషధాన్ని విజయవంతంగా రూపొందించినట్లు ఐరిష్ ఔషధ తయారీ సంస్థ ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ ఇటీవల ప్రకటించింది.
తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘క్లాస్కోటెరాన్–5%’ సొల్యూషన్‌ను ‘బ్రీజులా’ అనే బ్రాండ్ పేరుతో 2027 నాటికి మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు దశల్లో విస్తృతంగా జరిపిన క్లినికల్ పరీక్షల్లో ఈ ఔషధం అద్భుత ఫలితాలను సాధించిందని, దీనిని ఉపయోగించిన వారి బట్టతలలపై జుట్టు మొలిచిందని ‘కాస్మో ఫార్మాసూటికల్స్’ తెలిపింది. మూడో దశ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత దీనిని మార్కెట్‌లో అందుబాటులోకి తేనున్నామని ప్రకటించింది.


