ప్లాస్టిక్ తయారీలో బాసిల్లస్, సబ్‌టిలిస్ అనే బ్యాక్టీరియా వినియోగం
వాడి పారేసిన తర్వాత ఆరు రోజుల్లో పూర్తిగా మాయం
చైనా శాస్త్రవేత్తల ఆవిష్కరణ
చైనాలో పర్యావరణహితమైన ప్లాస్టిక్ తయారవుతోంది. షెన్‌జెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింథటిక్ బయాలజీ శాస్త్రవేత్తలు బాసిల్లస్, సబ్‌టిలిస్ అనే బ్యాక్టీరియాను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును వాడి పారేసిన తర్వాత ఈ బాసిల్లస్ బ్యాక్టీరియా పాలిమర్ చైన్‌ని కొరికి ముక్కలు చేసి చిన్న అణువులుగా మారుస్తుంది. ఆ రేణువులను సబ్‌టిలిస్ బ్యాక్టీరియా నమిలి మోనోమర్ ఖండాలుగా విడదీస్తుంది. ఎంజైమ్‌లను స్రవించి ప్లాస్టిక్‌ని పూర్తిగా హరించి వేస్తుంది.
ఆరు రోజుల్లో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కూడా మిగలకుండా చేస్తుంది. ప్లాస్టిక్‌కు బలాన్నిచ్చేవి పాలిమర్ గొలుసులు. ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయిన తర్వాత రేణువులు వాటంతట అవి క్షీణించిపోకుండా వందల ఏళ్లపాటు అలాగే ఉంటాయి. మట్టిని, నీటిని కలుషితం చేస్తుంటాయి. చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ప్లాస్టిక్‌లో సూక్ష్మజీవుల బీజాంశాలను నిద్రాణ దశలో పొందుపరుస్తున్నారు. పాలీ క్యాప్రోలాక్టోన్ (పీసీఎల్) ప్లాస్టిక్ మీద వాళ్లు చేసిన ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి.
బ్యాక్టీరియా ఎప్పుడు నిద్రలేస్తుంది?
వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా ఉత్తేజితం కాని విధంగా ప్లాస్టిక్‌ను రూపొందించారు. బ్యాక్టీరియా బీజాంశాలను నిద్రాణ స్థితిలో ఉంచి దానిని పీసీఎల్‌లో ఒక పొరలాగ నిక్షిప్తం చేస్తారు. ఆ ప్లాస్టిక్ వస్తువు వాడకం పూర్తయిన తర్వాత నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా ఆ వస్తువును 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసిన ఒక పోషక ద్రావణాన్ని కలుపుతారు. అప్పుడు నిద్రాణంగా ఉన్న బ్యాసిల్లస్, సబ్‌టిలిస్ బ్యాక్టీరియా బీజాంశాలు ఉత్తేజితమవుతాయి. ఎంజైమ్‌లను స్రవించే స్థితికి చేరతాయి. ఆ తర్వాత ఆరు రోజుల్లో ఆ ప్లాస్టిక్ వస్తువు మోనోమర్ యూనిట్‌లుగా విచ్ఛిన్నమవుతుంది.
చదవండి: తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమేనన్న చైనా
ప్యాకింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ విచ్ఛిన్నం కోసం క్యూటినేసెస్, లైపేసెస్, ఎస్టరేసెస్, హైడ్రోలేసెస్ వంటి మరికొన్ని ఎంజైమ్‌ల వాడకం ప్రయోగదశ దాటి వాడుకలోకి వచ్చింది. కానీ ప్రస్తుత పరిశోధన ప్లాస్టిక్‌ని విచ్ఛిన్నం చేయడంతోపాటు అవశేషాలను కూడా వదలకుండా క్షయం చేసే ప్రక్రియలో విజయం సాధించింది. ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి హితకారిణి. దీనిని బయోప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ అనవచ్చు.
- సాక్షి స్పెషల్ డెస్క్


