తైవాన్‌ కోసం యుద్ధానికైనా సిద్ధమే! | Xi Jinping Warns Trump On Taiwan During Beijing Talks, US-China Leaders Discuss Trade, Iran And Hormuz Security | Sakshi
Sakshi News home page

తైవాన్‌ కోసం యుద్ధానికైనా సిద్ధమే!

May 15 2026 4:52 AM | Updated on May 15 2026 10:11 AM

China Xi warns Donald Trump about Taiwan at Beijing summit

అమెరికా సరిగ్గా వ్యవహరించకపోతే ఘర్షణ తప్పదు  

డొనాల్డ్‌ ట్రంప్‌కు తేల్చిచెప్పిన చైనా అధినేత జిన్‌పింగ్‌  

బీజింగ్‌లో సమావేశమైన ఇరువురు నేతలు  

ఇరాన్‌ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యంపై విస్తృత చర్చలు  

సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం  

ఇరాన్‌ అణ్వాయుధాలు సొంతం చేసుకోవడానికి వీల్లేదని స్పషీ్టకరణ  

వైట్‌హౌస్‌ను సందర్శించాలని జిన్‌పింగ్‌ దంపతులకు ట్రంప్‌ ఆహ్వానం  

బీజింగ్‌: తైవాన్‌ విషయంలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ తన మనసులోని మాటను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నేరుగా చెప్పేశారు. తైవాన్‌ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకోక తప్పదని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరు అడ్డుతలిగినా లెక్కచేయబోమని పేర్కొన్నారు. తైవాన్‌ అంశంలో సరిగ్గా వ్యవహరించకపోతే చైనా, అమెరికాల మధ్య వివాదాలు, తీవ్ర సంఘర్షణలు తలెత్తవచ్చని ట్రంప్‌తో జిన్‌పింగ్‌ అన్నారు. 

తైవాన్‌ కోసం యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలిచ్చారు. రాజధాని బీజింగ్‌లో ట్రంప్, జిన్‌పింగ్‌ గురువారం సమావేశమయ్యారు. ఇరాన్‌ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు విస్తృతస్థాయిలో చర్చించుకున్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హార్మూజ్‌ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఉమ్మడిగా తేల్చిచెప్పారు. 

ఈ ఏడాది సెపె్టంబర్‌ 24న వైట్‌హౌస్‌ను సందర్శించాలంటూ జిన్‌పింగ్‌ దంపతులను ట్రంప్‌ ఆహ్వానించారు. నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడమే ధ్యేయంగా చైనా, అమెరికాలు ఒక నూతన విధానంపై అంగీకారానికి వచ్చాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాలను నిర్మించాలనే కొత్త విధానంపై ట్రంప్‌తో ఏకీభవించానని ఉద్ఘాటించారు. 

ఈ నూతన విధానం రాబోయే మూడేళ్లు, ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని, దీనిని ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం కూడా స్వాగతించాలని చెప్పారు. చైనా–అమెరికా సంబంధాల్లో తైవాన్‌ సమస్య అత్యంత ముఖ్యమైన అంశంగా మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరత్వం నెలకొంటుందని.. లేనిపక్షంలో సంఘర్షణలను ఎదుర్కోవాల్సి రావొచ్చని, ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని జిన్‌పింగ్‌ వెల్లడించారు. అందుకే తైవాన్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు సూచించారు.  

ఇది చరిత్రాత్మక సంవత్సరం  
ట్రంప్, జిన్‌పింగ్‌ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్‌ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్‌ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించడం, యూఎస్‌ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు. 

ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్‌) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. హార్మూజ్‌ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్‌పింగ్‌ స్పష్టంచేశారు. 

భవిష్యత్తులో హార్మూజ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్‌ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్‌పింగ్‌ బీజింగ్‌ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ను సందర్శించారు.  

ట్రంప్‌ గౌరవార్థం జిన్‌పింగ్‌ విందు  
చైనా పర్యటనకు వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. చైనా, అమెరికాలు సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. సంబంధాలను విజయవంతం చేయాలి, ఎప్పటికీ చెడగొట్టకూడదని అన్నారు. పరస్పర సహకారం వల్ల రెండు దేశాలూ లాభపడతాయని, ఘర్షణ వల్ల నష్టపోతాయని వ్యాఖ్యానించారు. మన రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పని చేయాలన్నారు.

 అమెరికా–చైనా సంబంధం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధమని ట్రంప్‌ ఉద్ఘాటించారు. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వివరించారు. జిన్‌పింగ్‌ను చాలా గొప్ప నాయకుడిగా ట్రంప్‌ అభివరి్ణంచారు. ఇదిలా ఉండగా, ఒక అమెరికా అధ్యక్షుడు చైనాను సందర్శించడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2017లో అప్పడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ చైనాలో పర్యటించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement