సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరంలో దుర్గా పూజ మండపాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘హిందూ జాగరణ్ మంచ్’ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వెలిసిన ఈ పోస్టర్లలో, ప్రజలు బిర్యానీతో పాటు పూజా సామగ్రిని కేవలం హిందువుల దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని కోరారు. ఈ పోస్టర్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవడంతో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ వివాదంపై హిందూ జాగరణ్ మంచ్ ప్రతినిధులు ప్రశాంత్ సర్కార్, అభిషేక్ దాస్ స్పందిస్తూ.. ఇది ఎవరికీ జారీ చేసిన ఆదేశం కాదని, కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక హిందూ వ్యాపారుల వద్ద కొనుగోలు చేయడం ద్వారా వారికి మద్దతు లభిస్తుందని, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడి ప్రజల ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రచారం చేపట్టామని వారు వాదించారు.
ఈ చర్యను వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మతపరమైన పోస్టర్లు ఏర్పాటు చేయడం నేరమని సీపీఎం సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ భట్టాచార్య మండిపడ్డారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని, ఒకరి జీవనోపాధిని మతంతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంటూ, పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఆ పోస్టర్లను తొలగించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ వివాదంపై భారతీయ జనతా పార్టీ దూరం పాటించింది. హిందూ జాగరణ్ మంచ్ ఒక స్వతంత్ర సంస్థ అని, ఈ పోస్టర్ల వ్యవహారంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ కార్యకర్తలు పేర్కొన్నారు. బెంగాల్ సంస్కృతిలో ఆహారాన్ని ఎన్నడూ మత ప్రాతిపదికన చూడలేదని, దుర్గా పూజ మండపాల అలంకరణలోనూ ముస్లిం కళాకారులు భాగస్వాములవుతుంటారని స్థానికులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇదీ చదవండి: ఆర్డర్ వివాదం: డెలివరీ బాయ్‌ని వెంటాడి కొట్టిన రైడర్లు


