న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలోని సెక్టార్-150 వద్ద ఉన్న టాటా యురేకా పార్క్ సొసైటీ బయట ఆన్‌లైన్ డెలివరీ రైడర్ల తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఒక ఆన్‌లైన్ ఆర్డర్‌ను ఎవరు తీసుకెళ్లాలనే విషయంలో మొదలైన చిన్న వివాదం కాస్తా మాటామాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
ఈ గొడవలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు మరో డెలివరీ బాయ్‌ను రోడ్డుపై పరుగులు పెట్టించి విచక్షణారహితంగా కొట్టారు. తప్పించుకునే క్రమంలో ఆ యువకుడు సొసైటీ లోపలికి పరుగులు తీయగా, అక్కడి సెక్యూరిటీ గార్డులు, స్థానికులు కల్పించుకుని అడ్డుకున్నారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే నాలెడ్జ్ పార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు కొత్వాలీ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు


