పటమట (విజయవాడ తూర్పు): నగరంలో ‘పంది’ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా? అన్న వ్యంగ్య ప్రశ్నతో పంది ముఖంతో కూడిన పోస్టర్లు విజయవాడలోని పలు ప్రాంతాల్లో గోడలపై దర్శనమిచ్చాయి. గాం«దీనగర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో గోడలపై, ఆటోలపై ఈ పోస్టర్లు అంటించినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు చేపట్టిన ఈ ప్రచారం ఇప్పుడు నగర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి ఈ నెల 19న ఇదే పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఖాతా నుంచి బుధవారం రాత్రి ఓ ఆడియో విడుదల చేశారు. జెండాలు మారాలి.. నినాదాలు మారాలి.. నాయకులు మారాలి.. ప్రజల బతులుకు మారాలి.. కానీ ఇవన్నీ జరగటం లేదంటూ ఆడియో విడుదల చేయటం మరో సంచలనంగా మారింది. తాజాగా విజయవాడలోనూ పోస్టర్లు కనిపించడంతో ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు? దీని ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇదే తరహా పోస్టర్లు కనిపించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ
పోస్టర్ల వెనుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసిన నాయకుడు ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన ఓ నాయకుడు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల్లో చర్చ జరిగేలా ఈ ప్రచారాన్ని ప్రారంభించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ఐఏఎస్ అధికారులు, సినీ ప్రముఖుల పేర్లను కూడా కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తరహాలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? అనే చర్చ కూడా నడుస్తోంది.
కొత్త పార్టీ పేరుతో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? పార్టీ ఏర్పాటు ఆలోచన ఉందా? లేక ఇది కేవలం రాజకీయ వ్యంగ్య ప్రచారమేనా? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రాజకీయ పారీ్టకి చెందిన వ్యక్తి ఎన్నిక కావడంపై అసంతృప్తితో ఈ పోస్టర్ల ప్రచారం చేపట్టారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ పోస్టర్ల వ్యవహారంపై పోలీ సులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పోస్టర్లు అంటించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, వాటిని ఎవరు అంటించారు? వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో వివ రాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


