నిర్భయుడొచ్చాడు
తూర్పు తీర రక్షణకు స్వదేశీ అస్త్రం.. అశాంక్
విశాఖ నౌకాదళానికి అశాంక్ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ యుద్ధ నౌక అప్పగింత
ఆర్నాలా శ్రేణిలో ఆరో నౌకగా అశాంక్
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్‌లో నిర్మాణం
వాటర్ జెట్ ప్రొపెల్షన్‌తో గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్లే అశాంక్
88 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌక
జీఆర్‌ఎస్‌ఈలో నిర్మితమైన 120వ నౌకగా అశాంక్
భయమంటే ఎరుగని సరికొత్త సముద్ర యోధుడు భారత నౌకాదళంలో అడుగుపెట్టాడు. తక్కువ లోతు నీటిలోనూ ఈ స్వదేశీ వేటగాడు గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తూ.. శత్రువుల్ని నామరూపాల్లేకుండా చేసేస్తాడు. విశాఖ తీరానికి అభేద్యమైన రక్షణ కవచంగా అవతరించిన ఆ వేటగాడి పేరు ‘అశాంక్’.
సాక్షి, విశాఖపట్నం: సముద్రంపై అలలు ప్రశాంతంగా కనిపిస్తుండొచ్చు. కానీ.. ఆ నీటి అడుగున ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు? శత్రు దేశాల జలాంతర్గాములు నిశ్శబ్దంగా మన తీరం వైపు దూసుకొస్తుంటే వాటిని అడ్డుకునేదెవరు? ఈ ప్రశ్నకు భారత నౌకాదళం ఇచ్చిన సమాధానమే ‘అశాంక్’ (నిర్భయుడు). ఈ స్వదేశీ యుద్ధనౌక విశాఖపట్నం వేదికగా ఈనెల 23న నౌకాదళంలో చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ నిర్మించిన 120వ యుద్ధ నౌకగా చరిత్రకెక్కిన ఈ నౌక తూర్పు నౌకాదళానికి సరికొత్త ఆయుధంగా మారింది.
భారత నౌకాదళంలోని పాత తరం అభయ్ క్లాస్ కార్వెట్స్ స్థానంలో అత్యంత ఆధునిక యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకల్ని ప్రవేశపెట్టే ప్రాజెక్టులో భాగంగా ‘అశాంక్’ నిర్మాణం సాగింది. జీఆర్‌ఎస్‌ఈ.. ఈ యుద్ధ నౌకను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ప్రమాణాలతో నిర్మించింది. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ గౌతమ్ మార్వాహాకు జీఆర్‌ఎస్‌ఈ అధికారులు ఈ యుద్ధనౌకను అధికారికంగా అప్పగించారు. ఆర్నాలా శ్రేణిలో ఐదవదైన అమిని వార్‌షిప్‌ను అందించిన 18 రోజుల వ్యవధిలోనే ఆరవ నౌక అయిన అశాంక్‌ని కూడా అప్పగించడం విశేషం.
తక్కువ నీటిలోనూ సత్తా చాటేలా!
సాధారణంగా భారీ యుద్ధనౌకలు లోతు తక్కువగా ఉండే తీరప్రాంత జలాల్లోకి వెళ్లలేవు. సరిగ్గా అక్కడే ‘అశాంక్’ తన అసలు సత్తా చూపిస్తుంది. సముద్ర గర్భంలో దాగి ఉండే శత్రు దేశాల జలాంతర్గాములను పసిగట్టి నాశనం చేయడమే లక్ష్యంగా ఇందులో బహుళ అంచెల ఆయుధ వ్యవస్థలను అమర్చారు. కేవలం 2.7 మీటర్ల లోతు నీటిలోనూ 77.6 మీటర్ల పొడవు, 900 టన్నుల బరువున్న ఈ నౌక మెరుపు వేగంతో కదులుతుంది. వాటర్ జెట్ ప్రొపల్షన్ సాయంతో గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తూ.. 1,800 నాటికల్ మైళ్ల మేర నిరంతరాయంగా గస్తీ కాస్తుంది.
సముద్ర గర్భంలో దాగిన శత్రువుల జాడను కనిపెట్టేందుకు ఇందులో అత్యాధునిక అభయ్ సోనార్లు, లో ఫ్రీక్వెన్సీ వేరిబుల్ డెప్త్ సోనార్లు సముద్రపు లోతుల్లోని కదలికలను కచ్చితంగా గుర్తిస్తాయి. ఒక్కసారి లక్ష్యం దొరికిందంటే.. లైట్ వెయిట్ టార్పెడోలు, స్వదేశీ యాంటీ–సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు, 30 మిల్లీవీుటర్ల నేవల్ సర్ఫేస్ గన్, రిమోట్ కంట్రోల్డ్ గన్స్‌తో విరుచుకుపడి శత్రువును నామరూపాల్లేకుండా చేయగల సామర్థ్యం దీని సొంతం. సముద్ర బాంబులను అమర్చే వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి.
88 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో..
ఒకప్పుడు రక్షణ రంగ పరికరాల కోసం విదేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు సొంతంగా అద్భుతాలు సృష్టిస్తోంది. ‘అశాంక్’ నిర్మాణంలో దాదాపు 88 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం దీనికి నిదర్శనం. బంగాళాఖాతంలో విదేశీ నౌకలు, జలాంతర్గాముల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్నంలో ‘అశాంక్’ చేరిక వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది.
తీరానికి సమీపంలోని లోతు తక్కువ జలాల్లోకి పెద్ద యుద్ధనౌకలు వెళ్లలేని ప్రాంతాల్లోనూ ఈ నౌక సులువుగా గస్తీ తిరుగుతూ శత్రువుల చొరబాట్లను అడ్డుకుంటుంది. విశాఖ తీరంలోని కీలక నౌకాదళ స్థావరాలు, ఓడరేవులతో పాటు సముద్ర వాణిజ్య మార్గాలకు ఇది అభేద్యమైన రక్షణ కవచంలా నిలవనుందని నౌకాదళ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అశాంక్ సామర్థ్యంఇదీ..
పొడవు : 77.6 మీ
వెడల్పు : 10.5 మీ
బరువు : 900 టన్నులు
వేగం : 25 నాట్స్ గంటకు
సామర్థ్యం : 1,800 నాట్స్ ఏకధాటిగా ప్రయాణం
సిబ్బంది : 57 మంది.. ఏడుగురు అధికారులు సహా
స్వదేశీ పరిజ్ఞానం : 88 శాతం


