కొండూరులో పింఛన్‌దారులకు నోటీసులు
అనుమానాలు రేకెత్తిస్తున్న నందిగామ ఎంపీడీవో తీరు
స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మెప్పు కోసం యత్నం
నందిగామ రూరల్: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ నాయకులు బరితెగిస్తుండగా.. వారి మెప్పు కోసం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు గట్టి పోటీ ఇస్తుండటంతో కూటమి పార్టీ నేతలకు కునుకు కరువైంది. విజయం కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు, పింఛన్లు రాకుండా చేస్తామని కూటమి పార్టీల నేతలు బెదిరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మరో అడుగు ముందుకేసి.. విచారణకు రావాలంటూ కొండూరు గ్రామంలో 20 మంది పింఛన్‌దారులకు మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చారు. దీంతో పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు.
సామాజిక పింఛన్ లబ్ధిదారుల అర్హతకు సంబంధించి అందిన ఫిర్యాదుపై విచారణ కోసం దివ్యాంగులు తమ ఒరిజినల్ సదరం ధ్రువీకరణ పత్రం, వైకల్యానికి సంబంధించిన ఇతర పత్రాలు, డప్పు కళాకారులు తమ అర్హతల పత్రాలు, సంబంధిత రికార్డులతో బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి హాజరు కావాలని ఎంపీడీవో ప్రసాదరావు 20 మంది పింఛనుదారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి లబ్దిదారులకు చెప్పారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు పంచాయతీ కార్యదర్శి రవిని అడగగా.. ఎంపీడీవో ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని చెప్పినట్లు తెలిపారు.
పొరపాటున వచ్చాయంటూ తప్పించుకునేయత్నం
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విచారణకు పిలవటం ఏమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పటంతో నోటీసులు పొరపాటున వచ్చాయని ఎంపీడీవో తప్పించుకునే యత్నం చేసినట్లు సమాచారం. ఆ తరువాత ఎంపీడీవో పేరుతో వచ్చిన నోటీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకే ఇలా నోటీసులు జారీచేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్‌దారులు విచారణకు హాజరు కావాలని తన పేరుతో వచ్చిన నోటీసులు అవాస్తవమని, నోటీసుపై తాను సంతకం చేయలేదని ఎంపీడీవో ప్రసాదరావు చెప్పారు. నోటీసుల వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


