అల్లంపాడులో 5.5 సెంటీమీటర్ల వర్షం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కోట, గూడూరు, దుట్టలూరు, సీతారామపురం, నాయుడుపేట, విడదలూరు, అల్లూరు, నెల్లూరు మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కోట మండలం అల్లంపాడులో 5.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గూడూరులో 5.1, దుత్తలూరులో 3.8 సెంటీమీటర్ల వాన కురిసింది. తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. మరో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మన్నార్‌గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపింది. శుక్రవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


