బాబు నాటకం.. బీమా బూటకం | Farmers and farmer associations are angry over the behavior of Chandrababu government | Sakshi
Sakshi News home page

బాబు నాటకం.. బీమా బూటకం

Nov 26 2026 4:44 AM | Updated on Nov 26 2026 4:46 AM

Farmers and farmer associations are angry over the behavior of Chandrababu government

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురంలో ఇటీవల తుపాను వల్ల నీట మునిగిన వరి పంటను చూపుతున్న రైతు

ఖరీఫ్‌లో కరువు, వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు

రెండున్నరేళ్లుగా ఏ ఒక్క రైతుకూ పైసా  బీమా పరిహారం కూడా అందని దుస్థితి 

ఇన్‌పుట్‌ సబ్సిడీదీ అదే పరిస్థితి.. 

ఏడాది గడిచినా అందని  మొంథా తుపాను పరిహారం 

బాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రైతులు, రైతు సంఘాలు

వైఎస్‌ జగన్‌ హయాంలో పైసా భారం పడకుండా ఐదేళ్లూ ఉచిత పంటల బీమా అమలు 

నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగైన ప్రతీ ఎకరాకు ఉచిత బీమా రక్షణ.. 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్‌

ఏటా సగటున 50 లక్షల మంది రైతులకు బీమా రక్షణ 

దెబ్బతిన్న పంటలకు మరుసటి ఏడాది అదే సీజన్‌ ముగిసేలోగా బీమా పరిహారం.. ఐదేళ్లలో 54.55 లక్షల మందికి ఏకంగా రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారం

ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 34.41 లక్షల మంది రైతులకు మరో రూ.3,261.60 కోట్ల మేర పంట నష్ట పరిహారం  

సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు అన్నదాతలపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అధికారంలోకి వచ్చీ రాగానే అటకెక్కించిన చంద్రబాబు సర్కార్‌ స్వచ్చంద పంటల బీమా పేరిట రైతులను నిలువునా మోసగిస్తోంది. రెండున్నరేళ్లుగా ఏ ఒక్క రైతుకు పైసా బీమా పరిహారం అందకుండా మోకాలడ్డిన బాబు సర్కార్‌ వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ ఏడాది తీవ్రమైన కరువు, వరుస తుపాన్లు, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ఒక్క రూపాయి సాయం చేయకుండా చుక్కలు చూపిస్తోంది. 

ఒకవైపు కరువు ప్యాకేజీలను ప్రకటిస్తూ పొరుగు రాష్ట్రాలు తమ రైతులను ఉదారంగా ఆదుకుంటుంటే.. ఏపీలో మాత్రం కూటమి సర్కార్‌ అందుకు విరుద్దంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్టపరిహారం), పంటల బీమా పరిహారం అందించకుండా  రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. రెండున్నరేళ్లలో దాదాపు 20కిపైగా విపత్తులు సంభవిస్తే ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. మొంథా తుపాను పరిహారం ఏడాది గడిచినా రైతులకు జమ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎగరగొట్టి స్వచ్చంద బీమా అంటూ అన్నదాతలను దగా చేసింది. 

కరువు.. ఆపై వరుస వైపరీత్యాలు 
ఖరీఫ్‌ సీజన్‌లో కనివినీ ఎరుగని రీతిలో చంద్ర­బాబు కరువు విలయ తాండవం చేసింది. దాదా­పు ఐదు లక్షల ఎకరాల్లో పంటలే సాగవలేదు. సాగైన ప్రాంతాల్లో సైతం సగానికి పైగా విస్తీర్ణంలో తీవ్ర వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. ఇంత ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేసిన గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు ఉత్తరాంధ్రలో కొద్దొగొప్పో సాగైన పంటలను సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు తోడు అక్టోబర్, నవంబర్‌లో వరుసగా విరుచుకు పడిన అర్నబ్, మురసు తుపానులు తుడిచి పెట్టేశాయి. ఖరీఫ్‌లో సాగైన ఆహార, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ పంట నమోదులో 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్టుగా నమోదు చేశారు. వాటిలో 79 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 46 లక్షల ఎకరాల్లో ఉద్యాన తదితర పంటలు సాగైనట్లు నమోదు చేశారు.

దాదాపు 16.57 లక్షల మంది రైతులు 42.75 లక్షల ఎకరాల్లో పంటలకు రూ.630.55 కోట్ల మేర ప్రీమియం చెల్లించారని అక్టోబర్‌లో ప్రకటించిన కూటమి సర్కార్‌.. తాజాగా నిన్న ముఖ్యమంత్రి సమీక్షలో మాత్రం కేవలం 28.88 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు బీమా కవరేజ్‌ పొందారని ప్రకటించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆ లెక్కన ఈ పంట డేటా ప్రకారం సాగైన విస్తీర్ణంలో ఐదో వంతుకు కూడా బీమా కవరేజ్‌ కల్పించలేదని ప్రభుత్వమే అంగీకరించింది. దాంట్లో కూడా కరువు, వరుస వైపరీత్యాల వల్ల 31.59 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రకటించిన ప్రభుత్వం కేవలం 20.12 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు మాత్రమే బీమా పరిహారం దక్కనుందని తేల్చేసింది. 

ప్రధానంగా వరి 38 లక్షల ఎకరాల్లో సాగైతే  కేవలం 7.50 లక్షల ఎకరాలకే బీమా కవరేజ్‌ లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరువు, వరుస వైపరీత్యాల వల్ల 8.24 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం దాంట్లో కేవలం 4.02 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటకు మాత్రమే బీమా పరిహారం దక్కనుందని తేల్చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ వాటా ప్రీమియం ఒక్క పైసా కూడా చంద్రబాబు సర్కా­ర్‌ చెల్లించలేదు. దీంతో ఆ మేరకు పరిహారం వ­స్తుందో లేదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. 

ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఎగనామమే.. 
ప్రాథమిక అంచనాల ప్రకారం సెప్టెంబర్ లో భారీ వర్షాలకు దాదాపు లక్ష ఎకరాలు, అర్నబ్‌ తుపానుకు 9.38 లక్షల ఎకరాలు, మురసు తుపానుకు 3.62 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. చివరికి తుది పంట నష్టం అంచనాల ప్రకారం భారీ వర్షాలకు 46 వేల ఎకరాలు, అర్నబ్‌ తుపానుకు 5.60 లక్షల ఎకరాలు, మురసు తుపానుకు 1.31 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలతో పాటు 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్టుగా లెక్క తేల్చారు. 

మరొక వైపు 21 జిల్లాల పరిధిలో 412 కరువు మండలాలను ప్రకటించగా ప్రాథమికంగా దాదాపు 35 లక్షల ఎకరాల్లో పంటలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కేవలం 23.27 లక్షల ఎకరాల్లో పంటలు మాత్రమే కరువు బారిన పడినట్టుగా లెక్క తేల్చారు. ఆ మేరకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2,743.78 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఈ పరిహారం ఎప్పుడిస్తారో చెప్పలేని దుస్థితి నెలకొంది. రెండున్నరేళ్లలో ఏ ఒక్క విపత్తుకూ పైసా పరిహారం విదల్చలేదు. దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా పంట నష్టపరిహారం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

రెండున్నరేళ్లుగా అందని బీమా పరిహారం 
ఖరీఫ్‌ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో పాటు 2024 జూన్‌లో చెల్లించాల్సిన ప్రభుత్వ వాటా మొత్తం రూ.911.99 కోట్లతో పాటు రబీ–2023–24 సీజన్‌కు  రైతుల వాటాతో కలిపి ప్రభుత్వ వాటా రూ.412.34 కోట్లను చంద్రబాబు సర్కార్‌ ఎగ్గొట్టింది. సకాలంలో ప్రభుత్వ వాటా ప్రీమియం చెల్లించి ఉండి ఉంటే 2023–24 సీజన్‌కు సంబంధించే రూ.1,385 కోట్ల బీమా పరిహారం రైతులకు ఈపాటికే అంది ఉండేది. 

చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్‌–2024 సీజన్‌లో ఉచిత పంటల బీమా అమలుకు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా కలిపి రూ.834.44 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. స్వచ్చంద పంటల బీమా అమలు కారణంగా రబీ–2024 సీజన్‌లో రూ.88.07 కోట్లు. ఖరీఫ్‌–2025 సీజన్‌కు రూ.172.60 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంది. సకాలంలో ప్రభుత్వ వాటా ప్రీమియం చెల్లించి ఉంటే రూ.3,500 కోట్లకు పైగా బీమా పరిహారం రైతులకు అంది ఉండేది. 

ఐదేళ్ల పాటు రైతులకెంతో భరోసా.. 
ఉచిత పంటల బీమా పుణ్యమాని వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య ఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌ ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటను సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్‌ బీమా కవరేజ్‌ కల్పించింది. ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్‌ కల్పించింది. ఏటా సగటున 50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.5 కోట్ల మంది రైతులు బీమా రక్షణ పొందారు. పైగా ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన బీమా పరిహారాన్ని ఆ మరుసటి ఏడాది అదే సీజన్‌ ముగిసేలోగా క్రమం తప్పకుండా అందించేవారు. 

అలా ఐదేళ్ల పాటు 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం అందించి గత ప్రభుత్వం అండగా నిలిచింది. ఇక ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్‌ ముగిసేలోగా అర్హులైన ప్రతి రైతుకూ అణా పైసలతో సహా లెక్కగట్టి మరీ పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ)  అందించి సాగుకు అండగా నిలిచారు. అలా ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతన్నలకు ఏకంగా రూ.3,261.60 కోట్ల మేర పంట నష్ట పరిహారాన్ని అందించి సాగుకు పూర్తి భరోసా కల్పించారు.  

దారుణంగా మోసగిస్తున్నారు 
ఉచిత పంటల బీమా అమలు చేసి ఉండి ఉంటే ఈ కష్టకాలంలో సాగైన ప్రతీ ఎకరాకు, ప్రతీ రైతుకు దీమా ఉండేది. కానీ ఈ పథకాన్ని అటకెక్కించడంతో రైతులకు ఆ ధీమా లేకుండా పోయింది. రెండున్నరేళ్లుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందని ద్రాక్షగా తయారైంది. గడిచిన ఖరీఫ్‌లో తుది పంట నష్టం అంచనాల (31.59 లక్షల ఎకరాలకు) ప్రకారం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2,743.78 కోట్లుగా లెక్క తేల్చగా ఆ మేరకు ఎకరాకు సగటున రూ.8,707 మించి అందని పరిస్థితి నెలకొంది. 

పంటల బీమా పరిహారం విషయానికి వస్తే సరాసరిన దక్కే బీమా పరిహారం (రూ.1,732 కోట్లు) లెక్కన  చూస్తే ఎకరాకు రూ.5,972 మించి బీమా పరిహారం పొందే అవకాశం లేదు. వాస్తవం ఇలా ఉంటే  సగటున ఎకరాకు ఆహార పంటలకు రూ.25 వేలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు రూ.50 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. రైతులను దారుణంగా మోసగిస్తున్నారు.   – వి.కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement