తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రామోజీరావు కుటుంబం విషప్రచారం చేయడం పరిపాటిగా మారిందని పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి వస్తే ‘ఈనాడు’కు ఎందుకంత ఉలికిపాటు అని నిలదీశారు. వైఎస్ జగన్ ప్రయాణాలపై కథనాలు రాసే ‘ఈనాడు’.. చంద్రబాబు ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఏపీకి వచ్చిన రోజులను ఎందుకు లెక్కించలేదు అని ప్రశ్నించారు. 2019–2024 మధ్య 1840 రోజుల్లో చంద్రబాబు ఏపీలో ఉన్నది కేవలం 130 రోజులేనని తెలిపారు.
‘‘చంద్రబాబు మరో 53 రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. వైఎస్ జగన్ నివాసాలపై కథనాలు రాసే ముందు చంద్రబాబు ఆస్తుల లెక్కలు కూడా రాయాలి. జగన్ నివాసాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిర్మించుకున్నవి. చంద్రబాబు మాత్రం అధికారంలో ఉన్నప్పుడే ప్యాలెస్‌లు కట్టిస్తారు. కాంట్రాక్టర్లతో ఫ్రీగా ప్యాలెస్‌లు కట్టించుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అమరావతిలో ఐదున్నర ఎకరాల్లో చంద్రబాబు నిర్మిస్తున్న నివాసానికి ఏ పేరు పెట్టాలి’’ అని ప్రశ్నించారు.
అది గిఫ్ట్ హౌస్ కాదా?
కరకట్ట నివాసం లింగమనేని ఇచ్చిన గిఫ్ట్ హౌస్ కాదా? అని నాగార్జున్ అన్నారు. ‘‘కుప్పం, హైదరాబాద్, నారావారిపల్లె, కొండాపూర్‌లో చంద్రబాబు కుటుంబ ఆస్తులపై సమాధానం చెప్పాలి. కొండాపూర్‌లో ఐదున్నర ఎకరాల భూమి లోకేశ్ పేరు మీదకు ఎలా వచ్చింది? చంద్రబాబు కుటుంబ ఆస్తుల కొనుగోళ్లు, గిఫ్ట్ డీడ్లపై పారదర్శకత ఏది? 1988లో వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ.36 వేల ఆదాయం ఉందని కోర్టుకు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

వెలగపూడిలో చంద్రబాబు కోసం కడుతున్న ప్యాలెస్ దళితుల శ్మశాన స్థలం. ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చి, ప్రతిఫలంగా భారీ ప్యాలెస్‌లు కట్టించుకుంటున్నారు. సచివాలయ టవర్స్ కాంట్రాక్టులతో సంబంధమున్న సంస్థకు ఇంటీరియర్ పనులు అప్పగించారు. వైఎస్ జగన్ నివాసాలపై రాసే ‘ఈనాడు’.. చంద్రబాబు ఆస్తులపై ఎందుకు రాయటంలేదు’’ అని నిలదీశారు.


