సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్లకే కాదు.. ఇప్పుడు దేవాలయాలకూ బుల్డోజర్ల భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్థాక్షిణ్యంగా కూల్చేయడం దారుణమన్నారు.
‘‘రోడ్డు అలైన్‌మెంట్ మార్చుకునే అవకాశం ఉన్నా ఆలయాన్నే ఎందుకు తొలగించారు? గతంలో దేవాలయాలపై చిన్న ఘటనలు జరిగినా ప్రభుత్వంపై విరుచుకుపడిన చంద్రబాబు.. ఇప్పుడు ఆలయాల కూల్చివేతను ఎలా సమర్థిస్తారు?. 2024 నుంచి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వరుస అపచారాలు.. భక్తుల ప్రాణాలకు భద్రత కరువైంది. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం, కాశీబుగ్గ ఘటనల్లో భక్తుల మరణాలకు బాధ్యత ఎవరిది?’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి నుంచి కాణిపాకం ఆలయ అభివృద్ధి వరకు వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. వైఎస్ జగన్ హయాంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు.. కూటమి హయాంలో ఆలయాల కూల్చివేతలు. తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?. ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేతపై బీజేపీ నేతలు కనీసం ఎందుకు స్పందించడం లేదు?. దేవాలయాల పరిరక్షణ చేతకాకపోతే దేవాదాయ శాఖను భక్తులకే అప్పగించండి. దేవాలయాల భూములు, లీజుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాధానం చెప్పాలి.
సింహాచలం కొండపై ప్రైవేటు సంస్థల కార్యకలాపాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను హిందూ భక్తులకు, ప్రజలకు వివరిస్తాం. ఆలయాల కూల్చివేతలు, అపచారాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం. హిందూ భక్తులు, స్వామీజీలను కలుపుకొని దేవాలయాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌కు మరోసారి కష్టమే


