‘ఆ మహిళది నూటికి నూరు శాతం హత్యే’ | YSRCP Leader Bhumana Demands Tirupati Woman Incident | Sakshi
Sakshi News home page

‘ఆ మహిళది నూటికి నూరు శాతం హత్యే’

Nov 25 2026 9:02 PM | Updated on Nov 25 2026 9:02 PM

YSRCP Leader Bhumana Demands Tirupati Woman Incident

తిరుప‌తి: బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ ఇంట్లో మహిళ మృతి సాధారణ మరణం కాదని, నూటికి నూరు శాతం హత్యేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అనామక శవం అంటూ ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించలేరని తేల్చిచెప్పారు. మృతదేహం ఆ ఇంట్లోకి ఎలా వచ్చింది? కేసు నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? మరుసటి రోజే పోస్టుమార్టం, ఖననం ఎలా జరిగాయి? అనే కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని తిరుపతి నగరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఇంటి యజమాని కాకుండా డ్రైవర్‌ ఫిర్యాదు చేయడం ఏంటి?
నేను నిన్నటి మీడియా సమావేశంలో ఎక్కడా కూడా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ పేరు ప్రస్తావించలేదు. ఒక మహిళ మృతి వెనుక హత్య దాగి ఉండొచ్చని, ఒక పార్టీ అధ్యక్షుడికి సంబంధం ఉందనే విషయం మాత్రమే ప్రస్తావించాను. ఆయనే ఇవాళ స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి స్పందించిన తర్వాతే అసలు విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సామంచి శ్రీనివాస్‌ ఇంటి పేరుతో ఉన్న లక్ష్మీ నిలయంలోనే ఒక మహిళ మృతదేహం దొరికింది. ఆయన ఇంట్లోనే మహిళ చనిపోయినప్పుడు ఇంటి యజమాని స్వయంగా ఫిర్యాదు చేయకుండా డ్రైవర్‌తో మరుసటి రోజు ఫిర్యాదు చేయించడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

ఉదయం మృతదేహం.. మరుసటి రోజు కేసు.. వెంటనే ఖననం?
గ‌త 27వ తేదీ ఉదయం 7.30 గంటలకు మృతదేహం కనిపించిందని డ్రైవర్‌ చెబుతున్నారు. కానీ 28వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఫిర్యాదు నమోదైంది. అనామక మృతదేహం అయితే వెంటనే ఎఫ్‌ఐఆర్‌, పంచనామా, ఫొటోలు, చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లలో మిస్సింగ్‌ కేసుల పరిశీలన జరగాలి. కానీ ఇక్కడ మరుసటి రోజే పోస్టుమార్టం, ఖననం జరిగిపోయాయి. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆ మహిళ గత పదేళ్లుగా సామంచి శ్రీనివాస్‌ ఇంట్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. అలాంటప్పుడు ఆమె ఎవరు? ఆమెకు ఆ ఇంటితో ఉన్న సంబంధం ఏమిటి? ఆమె అక్కడికి ఎలా వచ్చింది? రెండో అంతస్తు టెర్రస్‌ వరకు ఎలా వెళ్లింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే కేసును ముగించే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

పోలీసుల తీరుపైనా అనుమానాలు.. పూర్తి దర్యాప్తు జరగాలి
హ్యూమన్‌ రైట్స్‌ కోసం పనిచేస్తున్న ఓ మహిళతో ఎస్‌ఐ ప్రసాద్‌ మాట్లాడిన సంభాషణ కూడా బయటకు వచ్చింది. సామంచి శ్రీనివాస్‌ ఇల్లేనా అని అడిగినప్పుడు ఎస్‌ఐ సమాధానాలు తటపటాయిస్తూ చెప్పడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని చూసిన వెంటనే చేపట్టాల్సిన చర్యలన్నీ ఎందుకు చేపట్టలేదు? అనామక మృతదేహం అని చెబుతున్నప్పుడు దాని ఫొటోలు ప్రచురించి గుర్తింపు కోసం ఎందుకు ప్రయత్నించలేదు? మిస్సింగ్‌ కేసులపై ఎందుకు ఆరా తీయలేదు? ఈ అంశాలన్నింటినీ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించాలి.

ఇది నూటికి నూరు శాతం మర్డర్‌.. నిజాలు బయటకు రావాలి
నూటికి నూరు శాతం ఇది మర్డర్‌. ఇది సాధారణ మృతి కాదు. పోలీసుల ఫొటోలు, పోస్టుమార్టం, పంచనామా, మృతదేహాన్ని హడావిడిగా ఖననం చేసిన విధానం అన్నింటిపైనా సమగ్ర విచారణ జరగాలి. సామంచి శ్రీనివాస్‌ ఇంట్లో ఈ ఘటన ఎలా జరిగిందో, ఆ మహిళ ఎవరో, ఆమెకు ఆ ఇంటితో ఉన్న సంబంధం ఏమిటో తేలాలి. ఇప్పటికైనా ఆధారాలను కాపాడి సమగ్ర దర్యాప్తు చేయాలి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటు చేసి, ఇందులో కుమ్మక్కైన పోలీసులు, వైద్యులు, ఇతరుల పాత్రపై పూర్తి విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే’ అని స్పష్టం చేశారు.

 

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌ను నమ్ముకున్నందుకే మాకు ఈ దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement