విజయవాడ: అధికారంలో ఉన్నామనే అహంకారంతో స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం, బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం, అక్రమ నిర్భంధాలు చేయడం, జరుగుతున్న దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పదే పదే వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తున్నా సరే ఎస్‌ఈసీ ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమని నాయకులు మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతా రెడ్డి, పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎన్నికల ప్రవర్తనా నియామవాళిని అధికార పార్టీ నేతలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా సరే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇటీవల పరిస్థితులను పరిశీలిస్తుంటే, కూటమి పార్టీ నేతలు, కొందరు అధికారులతో కలసి రాష్ట్ర ఎస్ ఈసీ కూడా ఈ ఎన్నికల్లో కుమ్మక్కు అయిందని కూటమి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ధ్వజమెత్తారు. దొంగలు.. దొంగలూ కలసి ఊళ్లను పంచుకున్న రీతిలో ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గ్రామాల సర్పంచ్ పదవులను వేలం పాటలు నిర్వహిస్తుంటే ఎస్ఈసీ కనీసం చర్యలు తీసుకోకుండా కళ్లు మూసుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
స్థానిక ఎన్నికల అన్ని విడతల్లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై మేము ప్రతిసారీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తున్నాసరే కనీసం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నియంత్రించలేకపోతున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎస్ ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆలయ కూల్చివేతపై మౌనం ఎందుకు పవన్?


