వీకెండ్‌ విజిటర్స్‌.. 120 సార్లు పైగా చంద్రబాబు హైదరాబాద్‌ ప్రయాణం | Chandrababu has traveled to Hyderabad over 120 times | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ విజిటర్స్‌.. 120 సార్లు పైగా చంద్రబాబు హైదరాబాద్‌ ప్రయాణం

Nov 26 2026 4:51 AM | Updated on Nov 26 2026 4:51 AM

Chandrababu has traveled to Hyderabad over 120 times

ప్రజల డబ్బుతో.. ప్రత్యేక విమానాల్లో అంతులేని దుబారా.. 

ఈ 30 నెలల్లో 120కిపైగా హైదరాబాద్‌ పర్యటనలు.. వారాంతం వస్తే జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌కు బాబు పరుగు! 

సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు 

లండన్, వియత్నాం.. అధికారిక సమాచారం లేకుండానే షికార్లు! 

తండ్రి బాటలోనే లోకేశ్‌.. రహస్యంగా విదేశీ టూర్లు.. కీలక సమయాల్లోనూ అందుబాటులో లేని విద్యాశాఖ మంత్రి! 

తండ్రీకొడుకుల షటిల్‌ సర్వీసులకు ప్రభుత్వ ఖజానాపై పెను భారం! 

జగన్‌ పర్యటనలపై ఈనాడు ఏడుపు.. బాబు, లోకేశ్‌ ప్రయాణాలపై మౌనం!  

సాక్షి, అమరావతి: పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు ఉంది ఈనాడు తీరు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి వెళ్తే చాలు వేళ్ల మీద లెక్కపెట్టి వందోసారి అంటూ కథనాలు అచ్చేస్తోంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ హైదరాబా­ద్‌కు ఎన్నిసార్లు షటిల్‌ సర్వీసులు నడిపారు? ఎన్నిసా­ర్లు చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేశారు? ప్రజాధనంతో సాగుతున్న ఈ పర్యటనలపై మా­త్రం ఈనాడు కలం ఎందుకు కదలదు? 

30 నెలల్లో చంద్రబాబు ఏకంగా 120 సార్లకుపైగా హైదరాబా­ద్‌ జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌కు వెళ్లొచ్చారని లెక్క తేలింది. వారం అంతా ఉండవల్లి కరకట్టపై ఫొటో సెష­న్లు, వీకెండ్‌ వచ్చేసరికి ప్రత్యేక విమానంలో హై­దరాబాద్‌. ఇదే బాబు మార్క్‌ షటిల్‌ సర్వీసు పాల­న. తండ్రికి మించిన తనయుడు లోకేశ్‌. ఆయన ఎ­ప్పు­డు రాష్ట్రంలో ఉంటారో, ఎప్పుడు మాయమవుతారో సొంత పార్టీ నేతలకే తెలియదు. ప్రజల సొ­మ్మును వృథా చేస్తూ తండ్రీ కొడుకులు చేస్తున్న షటి­ల్‌ సర్వీస్‌ ఖర్చుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

వీకెండ్‌ వస్తే హైదరాబాద్‌ చెక్కేస్తున్న సీఎం  
బాబు దినచర్య చూస్తే వారాంతంలో ఉండవల్లి నుంచి బయల్దేరే బాబు, ఆదివారం కూడా జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో ఉంటున్నారు. ఒక్కోసారి సోమవారం కూడా అక్కడే గడుపుతున్నారు. ఇదేదో ఒక్కసారి జరిగింది కాదు. 30 నెలలుగా ఇదే తంతు. పండగైనా, పబ్బమైనా, కుటుంబ వేడుకైనా జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లోనే. అమరావతి రాజధాని అని ఊదరగొట్టే బాబు మనసంతా హైదరాబాద్‌ మీదే ఉంటోందనడానికే ఇవే నిదర్శనాలు.  

చెప్పాపెట్టకుండా లండన్‌కు 
హైదరాబాద్‌ షటిల్‌ సర్వీసు ఒక ఎత్తయితే రహస్య విదేశీ టూర్లు మరో ఎత్తు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన బాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్‌ అక్కడి నుంచి నేరుగా లండన్‌కు అత్యంత రహస్యంగా వెళ్లారు. అధికారిక షెడ్యూల్‌ లేదు, పర్యటన వ్యక్తిగతమా అధికారికమా అనే ప్రకటన సైతం ప్రజలకు తెలియదు. లీకుల ద్వారానే విషయం తెలిసింది. గత ఏడాది అయితే ఏడాదిలోనే బాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. పెట్టుబడుల పేరు చెప్పి కుటుంబంతో విహారయాత్రలు చేశారు. 

2019–24లో ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన ఏపీలో ఉన్న రోజులు 130 మాత్రమే. విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా రాష్ట్రానికి వచ్చి ప్రజలకు మాయమాటలు, అబద్ధాలు చెప్పి మోసాలు, కుట్రలతో అధికారంలోకి వచ్చారు.  స్థానిక ఎన్నికల సమయంలో సెప్టెంబర్‌ చివర్లో మళ్లీ చెప్పాపెట్టకుండా వియత్నాం ఎగిరిపోయారు. విమర్శలు వెల్లువెత్తాక అది మనవడితో హాలీడే ట్రిప్‌ అంటూ లోకేశ్‌ సెలవిచ్చారు. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే, విద్యార్థులు ఫీజు బకాయిలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రికి హాలీడే ట్రిప్పులు. అదే జగన్‌ విదేశాలకు వెళ్తే రోజుల తరబడి రోత కథనాలు వండిన ఈనాడు, బాబు విషయంలో మాత్రం నోటికి తాళం వేసుకుంది. 

సొంతిళ్లు ఎవరికి ఉన్నాయి.. ఈనాడు కళ్లకు బైర్లు కమ్మాయా? 
జగన్‌కు తాడేపల్లిలో సొంత ఇల్లు ఉంది. అక్కడే వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉంది. పార్టీ కార్యక్రమాలు, ప్రెస్‌మీట్లు, ప్రజా సమస్యలపై పోరాటాలు అక్కడి నుంచే సాగుతున్నాయి. ఏపీయే ఆయన శాశ్వత చిరునామా. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబుకు మాత్రం ఏపీలో సొంత గూడే లేదు. కుటుంబం, ఆస్తులు, ప్యాలెస్‌ అన్నీ హైదరాబాద్‌లోనే. సీఎంగా ఉంటున్నది సొంతింట్లో కాదు. కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా కట్టిన లింగమనేని అక్రమ గెస్ట్‌హౌస్‌లో. సొంతిల్లు లేదని విమర్శలు వెల్లువెత్తడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో  కొద్ది నెలల క్రితం హడావుడిగా అమరావతిలో, కుప్పంలో రెండు ప్యాలెస్‌లు కడుతున్నారు.  

బాబు డైరెక్షన్‌లో బురదజల్లడమే పని.. 
చంద్రబాబు డైరెక్షన్‌లో ఉషోదయాన పచ్చటి విషం చిమ్మే ఈనాడు జర్నలిజం విలువలకు ఏనాడో నిలువుపాతరేసింది. చంద్రబాబు ఏ తప్పు చేసినా కళ్లకు గంతలు కట్టుకుని కబోదిలా నటిస్తూ.. ప్రతిపక్ష నేత అడుగుతీసి అడుగేస్తే బురదజల్లుతూ అబద్దపు కథనాలతో నెట్టుకురావడం దాని నైజం. బాబుకు బాకా ఊదడం.. జగన్‌ మీద  పడి ఏడవడం..  ఈ రెండే జర్నలిజం ప్రమాణాలుగా ఈనాడు పాటిస్తోంది. 

లోకేశ్‌ అదృశ్య విన్యాసాలు కనపడవా? 
లోకేశ్‌ అదృశ్య విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి ఎటు వెళ్లారో తెలియని సందర్భాలు ఎన్నో. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేళ తండ్రి కంటే ముందే విదేశాలకు వెళ్లారు. ఆగస్టులో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. సరిగ్గా అదే సమయంలో విద్యాశాఖ మంత్రి విదేశాల్లో ఉన్నారు. ఆరాతీస్తే రహస్యంగా అమెరికా ఎగిరిపోయారని తెలిసింది. ఇదీ తండ్రీకొడుకుల బాధ్యతారాహిత్యం.

ఎవరి సొమ్ముతో ఈ షికార్లు?
జగన్‌ బెంగళూరు నుంచి వచ్చి వెళ్లడం పూర్తిగా సొంత ఖర్చు. ప్రజాధనం నుంచి ఒక్క రూపాయి కూడా వాడడం లేదు. కానీ తండ్రీకొడుకుల హైదరాబాద్‌ షటిల్‌కు ప్రత్యేక విమానాలు, భారీ కాన్వాయ్‌లు, భద్రతా సిబ్బంది హడావుడి అంతా ప్రజల సొమ్ముతోనే. ఖజానా ఖాళీ, అప్పుల ఊబి అంటూ సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్న బాబు, తన వారాంతపు విహారాలకు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల లెక్క మాత్రం బయటపెట్టడంలేదు. పసుపు పొరలు కమ్మిన ఈనాడుకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అస్సలు కనిపించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement