చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో నిలిపివేయండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
రామోజీరావు సంఘ సేవకుడు కాదు.. స్వాతంత్య్ర సమరయోధుడూ కాదు
ఫక్తు వ్యాపారవేత్త.. ఆర్థిక నేరాల కేసులు ఎదుర్కొన్న వ్యక్తి
అలాంటివాడి కోసం ప్రజల డబ్బు వెచ్చిస్తారా?
చంద్రబాబుకు రామోజీ వ్యక్తిగతంగా ఎంతో చేశారు..
ఆయన ప్రభుత్వ విధానాలకు ప్రచారం కల్పించారు.
ఆ కారణంగానే రామోజీ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించారు..
ఇది రాజకీయ పెద్దలు ఇష్టానుసారం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం..
సాక్షి, అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల పూర్వ చైర్మన్, చంద్రబాబు రాజగురువు చెరుకూరి రామోజీరావు జయంతిని ‘రాష్ట్ర వేడుక’గా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సమాజానికి ఎటువంటి సేవ చేయని ఓ వ్యక్తి పుట్టిన రోజును రాష్ట్ర వేడుకగా ప్రకటించడం ఏకపక్ష నిర్ణయమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా, ఒంగోలుకు చెందిన నార్నే వెంకట సుబ్బయ్య ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రతీ ఏటా నవంబర్ 16న రామోజీ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 243ను చట్ట విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని వెంకట సుబ్బయ్య తన వ్యాజ్యంలో హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ప్రభుత్వ జీవో అమలును నిలిపేయడంతో పాటు రామోజీ జయంతి నిర్వహణకు ప్రభుత్వ నిధులను, యంత్రాంగాన్ని వినియోగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. సమాజానికి ఏ రకంగానూ ఉపయోగపడని ఓ వ్యాపారవేత్త జయంతి కోసం ప్రజల డబ్బును వృథాగా ఖర్చు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఆయనేమీ సంఘ సేవకుడు కాదు...
‘రామోజీరావు సంఘ సేవకుడు కాదు.. స్వాతంత్య్ర సమరయోధుడు కాదు. ఆయన ఫక్తు వ్యాపారవేత్త. ప్రజాధనంతో ఇలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ నిధులను వ్యక్తిగత వేడుకలకు మళ్లించడానికి వీల్లేదు. వాటిని పేద, బలహీన వర్గాల విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన వంటి అత్యవసర సేవలకు ఉపయోగించాలి. సమాజానికి ఏమీ చేయని ఓ వ్యక్తి జయంతి కోసం ప్రజల డబ్బును ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వ పథకాలకు నిధులు తగ్గుతాయి. లబ్దిదారులకు అందాల్సిన పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుంది.
వివిధ శాఖలను ‘టాప్ ప్రయారిటీ‘ పేరుతో రామోజీరావు జయంతి కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములను చేయడం వల్ల పరిపాలనా భారం పెరుగుతుంది. అలాగే శాఖాపరమైన స్వయంప్రతిపత్తి దెబ్బతింటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి హేతుబద్ధత, ప్రాతిపదిక లేదు. రామోజీరావు జయంతిని ఎందుకు రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందో చెప్పలేదు. సహేతుక కారణాలు లేకుండా ఓ వ్యక్తి జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం. రాజకీయ పెద్దలు తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదు.’ అని వెంకట సుబ్బయ్య తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
రామోజీ నేర చరిత్ర సంగతేంటి..?
‘మార్గదర్శి ఫైనాన్షియల్స్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రామోజీరావు రూ. 248 కోట్ల మేర ప్రజాధనాన్ని దురి్వనియోగం చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిటర్ల రక్షణ చట్టం కింద ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 02.08.2024న ఆ కేసులన్నింటినీ మూసివేసింది. జప్తు ఉత్తర్వులను ఎత్తివేసింది. ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయడంతో పాటు, గతంలో తమకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే చంద్రబాబు ప్రభుత్వం రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని నిర్ణయం తీసుకుంది.
రామోజీ నేరచరిత్రను ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. అలాగే ప్రభుత్వం 2024న జూన్ 27న జరిగిన రామోజీ సంస్మరణ సభకు రూ.4.28 కోట్లు అధికారికంగా ఖర్చు చేసింది. ఇది రామోజీ కోసం కోట్ల రూపాయల మేర ప్రజల డబ్బును ఖర్చు చేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని చూపుతోంది. ప్రజాధనాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా, విచక్షణతో వినియోగించాలి కానీ తమ ఇష్టానుసారం ఖర్చు చేయకూడదు. 10.04.2025న ప్రభుత్వం జీవో 689 జారీ చేస్తూ 22 మంది ప్రముఖుల జయంతి వేడుకలు నిర్వహించే గౌరవాన్ని కల్పించింది. ఆ ఉత్తర్వుల ద్వారా గౌరవం పొందిన ప్రముఖులందరి విషయంలో ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలన్న నిర్ణయంపైనే సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.’ అని వివరించారు.


