నేడే.. పట్నం పోరు.. తొలి సం‘గ్రామం’ | Arrangements for the first phase of panchayat election polling | Sakshi
Sakshi News home page

నేడే.. పట్నం పోరు.. తొలి సం‘గ్రామం’

Nov 26 2026 5:11 AM | Updated on Nov 26 2026 5:11 AM

Arrangements for the first phase of panchayat election polling

రెండో దఫా మున్సిపల్‌.. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు 

నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ 

24.98 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

3,240 గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌  

గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు 

పల్లెల్లో ఓటు వేయనున్న 74.45 లక్షల మంది.. పట్నం, పల్లెల్లో కలిపి మొత్తం దాదాపు కోటి మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

సాక్షి, అమరావతి: మలివిడత మున్సిపల్‌ ఎన్నికలతో పాటు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి –తాడేపల్లి నగర కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ మొదలు కానుండగా.. 3,240 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు పదవులకు 7 గంటల నుంచే పోలింగ్‌ జరగ­నుంది. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

నగరాల్లో 11.44 లక్షలు..  పట్టణాల్లో 13.53 లక్షల మంది ఓటర్లు 
మలివిడత మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న నాలుగు నగర కార్పోరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 24,98,312 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 
» నాలుగు కార్పోరేషన్లలో మేయర్‌ పదవులకు 36 మంది అభ్యర్థులు, 257 డివిజన్ల కార్పోరేటర్‌ పదవులకు 911 మంది పోటీపడుతున్నారు. శ్రీకాకుళం నగర కార్పోరేషన్‌లోని 30 డివిజన్‌కు అభ్యర్ధులు ఎవరూ పోటీలో లేని కారణంగా అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోగా నాలుగు కార్పోరేషన్ల పరిధిలో మరో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 
» నాలుగు నగరాల్లో  మొత్తం 1,224 పోలింగ్‌ కేంద్రాల్లో 11,44,530 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.  
» 19 మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులకు 134 మంది అభ్యర్ధులు.. 707 వార్డు కౌన్సిలర్‌ పదవులకు 2,057 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆలూరు మున్సిపాలిటీలో నాలుగు వార్డులకు అభ్యర్ధులు ఎవరూ నామినేషన్లు వేయని కారణంగా ఎన్నికలు వాయిదా పడగా, 19 మున్సిపాలిటీల పరిధిలోని మరో 39 వార్డుల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 
» 19 మున్సిపాలిటీల్లో 1474 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ 13,53782 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.   
» నాలుగు కార్పోరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీల్లో మొత్తం 2,968 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 5,602 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.  
» ఆయా చోట్ల ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.  

26 జిల్లాలో తొలివిడత పంచాయతీ
గుంటూరు, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన 26 జిల్లాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. మొత్తం 3,949 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ కాగా 760 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైన కొన్ని చోట్ల వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 3,240 గ్రామ పంచాయతీ పరిధిలోని 25,057 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 
»  3,240 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.   
» తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 3,949 గ్రామ పంచాయతీల్లో 709 చోట్ల సర్పంచి పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  
» తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల సర్పంచి పదవుల్లో 19.24 శాతం ఏకగ్రీవాలు కాగా 80.76 సర్పంచి పదవులకే ఎన్నికలు జరుగుతున్నాయని.. మొత్తం వార్డు సభ్యుల పదవుల్లో 36.98 శాతం పదవులు ఏకగ్రీవమైనట్టు  పేర్కొంది. 
» ఎన్నికలు జరుగుతున్న 3,240 గ్రామ పంచాయతీల్లో 23,269 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74,45,583 మంది ఓటర్లు తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  
» అత్యధికంగా తిరుపతి జిల్లాలో 268 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా..అన్నమయ్య జిల్లాలో కేవలం 11 గ్రామ పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 
» గ్రామాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్‌ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement