ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆశాభంగం
జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 10.77 లక్షల మంది దరఖాస్తు
6.72 లక్షల దరఖాస్తులను ఆమోదించి ఓటు హక్కు కల్పన
1.61 లక్షల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోని ఈసీ
సెల్ఫ్ డిక్లరేషన్ లేదనే కారణంతో అత్యధిక దరఖాస్తుల తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026 పేరుతో రాష్ట్రంలో ఎడాపెడా ఓటర్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరోవైపు కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను లక్షల సంఖ్యలో తిరస్కరించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా ఓటర్ల నమోదుకు మొత్తం 10,77,450 మంది దరఖాస్తులు (ఫారం–6 ) చేసుకోగా.. 6,72,593 (62.42%) మంది దరఖాస్తులను ఆమోదించి ఓటు హక్కు కల్పించిన ఈసీ, ఏకంగా 2,43,643 (22.61%) మంది దరఖాస్తులను తిరస్కరించింది.
మిగిలిన 1,61,214 (14.96%) దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను ఆమోదించిన రేటు ఇప్పటివరకు 62.42 శాతమే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో సర్, 2026 ప్రక్రియ 2026 జూన్ 15 నుంచి ప్రారంభం కాగా.. అంతకు ముందు, ఆ తర్వాత కలిపి మొత్తం 4 దశల్లో ఈ దరఖాస్తులు వచ్చినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
నాలుగు విడతలుగా..
⇒ 2026 జనవరి 1 నుంచి జూన్ 14 వరకు (రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి) కొత్త ఓటర్ల నమోదు కోసం మొత్తం 5,20,331 మంది ఫారం–6 లు దాఖలు చేయగా, 3,22,785 (62.03%) మందికి ఓటు హక్కుకల్పించి 1,92,574 (37%)మంది దరఖాస్తులను తిరస్కరించింది. మిగిలిన 4,972 దరఖాస్తుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
⇒ సర్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించే సమయానికి అంటే, జూన్ 15 నుంచి ఆగస్టు 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 3,18,042 మంది దరఖాస్తు చేసుకోగా, 2,27,605 (71.56%) మందికి ఓటు హక్కు కల్పించి 38,270 (12.03%) మంది దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. మిగిలిన 52,167 (16.4%) మంది దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
⇒ సర్ ముసాయిదా జాబితా ప్రచురించిన నాటి నుంచి దరఖాస్తులు, అభ్యంతరాల దాఖలుకు గడువు ముగిసే నాటికి అంటే, ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 నాటికి కొత్త ఓటర్ల నమోదుకు 1,70,374 మంది దరఖాస్తు చేసుకోగా, 1,05,951 (62.18%) మందికి ఓటు హక్కు కల్పించి 11,566 (6.78%) మంది దరఖాస్తులను తిరస్కరించింది. 52,857 (31.02%) మంది విషయంలో నిర్ణయం పెండింగ్‌లో ఉంది.
⇒ అభ్యంతరాలు, దరఖాస్తుల గడువు ముగిసాక అక్టోబర్ 8 నుంచి ఇప్పటివరకు కొత్త ఓటర్ల నమోదుకు 68,703 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 16,252 (23.65%) మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించి 1,233 (1.79%) మంది దరఖాస్తులను తిరస్కరించారు.
బీఎల్‌ఓలు విఫలం కావడంతో ..!
ఫారం–6 దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను ‘సాక్షి’ ఆరా తీయగా, సెల్ఫ్ డిక్లరేషన్ లేకపోవడంతో పెద్ద సంఖ్యలో తిరస్కరించాల్సి వచ్చిందని ఓ ఎలక్టో్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) వివరణ ఇచ్చారు. ‘సర్’ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈసీ సెల్ఫ్ డిక్లరేషన్‌ను తప్పనిసరి చేసినా, అవగాహన రాహిత్యంతో చాలా మంది దరఖాస్తుదారులు సెల్ఫ్ డిక్లరేషన్ జత చేయలేదని గుర్తించామన్నారు. దీంతో ఇలాంటి దరఖాస్తులన్నింటినీ స్థానిక బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలకు) అప్పగించి మళ్లీ దరఖాస్తుదారులను కలిసి వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని సేకరించాలని ఆదేశించినట్టు తెలియజేశారు. అయితే బీఎల్‌ఓలు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలను దరఖాస్తుదారుల నుంచి సేకరించడంలో విఫలం కావడంతోనే గంపగుత్తగా దరఖాస్తులను తిరస్కరించినట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.
ప్రవాసీలకూ ఓటు హక్కు తిరస్కారం !
ఇక ప్రవాస తెలంగాణీయుల నుంచి కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 1 నుంచి మొత్తం 8,178 మంది ఫారం–6ఏ దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటివరకు 3,037 (37.16%) మంది దరఖాస్తులను ఆమోదించారు. 2,232 (27.29%) మంది దరఖాస్తులను తిరస్కరించగా, మిగిలిన 2,909 (35.57%) మంది దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక ప్రవాస తెలంగాణీయుల నుంచి కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 1 నుంచి మొత్తం 8,178 మంది ఫారం–6ఏ దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటివరకు 3,037 (37.16%) మంది దరఖాస్తులను ఆమోదించారు. 2,232 (27.29%) మంది దరఖాస్తులను తిరస్కరించగా, మిగిలిన 2,909 (35.57%) మంది దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


