పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో యువకుడి మనస్తాపం.. ఆత్మహత్య
ఆదిలాబాద్ టౌన్: తేలు కుట్టిన గాయానికి చికిత్స కోసం వెళ్లిన ఓ యువకుడు.. వీడియో కాల్‌లో ఎస్సై అయిన తన సోదరుడికి గాయాన్ని చూపించడం ఓ డాక్టర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వారు స్టేషన్‌కు తరలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం గురువారం ఆదిలాబాద్ పట్టణంలో కలకలం సృష్టించింది.
మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని వికలాంగుల కాలనీకి చెందిన కాంబ్లే రాజు కుమారుడు రాహుల్ (27) మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఓ ప్రైవేటు ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులను కలిసేందుకు రాగా బుధవారం రాత్రి తేలు కుట్టడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యుడి వద్ద ఉన్న సమయంలో వరుసకు సోదరుడైన ఎస్సై నుంచి ఫోన్ వచ్చింది. వీడియో కాల్‌లో గాయాన్ని చూపిస్తుండగా సదరు వైద్యుడు తన ముందే వీడియో తీస్తావా అంటూ బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టూటౌన్ పోలీసులు రాహుల్‌ను స్టేషన్‌కు తరలించి రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉంచారు. ఈ క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రాహుల్‌ను చితకబాదాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత వదిలి పెట్టడంతో ఇంటికి వచ్చిన రాహుల్ మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రిమ్స్ వైద్యుడు, స్టాఫ్‌నర్సు, టూటౌన్ పోలీసులే తన మృతికి కారణమని జిల్లా ఎస్పీని ఉద్దేశించి రాసిన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.


