బియ్యం వ్యాపారుల దోపిడీ.. గత ఖరీఫ్ సీజన్ బియ్యానికే భారీ ధరలు
రూ.60 విలువ కూడా చేయని బియ్యం రూ.100కు విక్రయం
రేషన్ బియ్యం కొనుగోలు.. రీసైక్లింగ్.. వివిధ బ్రాండ్ల పేరిట డిపోలకు సరఫరా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ తనిఖీల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులను బియ్యం వ్యాపారులు అవకాశంగా మలుచుకున్నారు. కరువు పేరు చెప్పి, గోదాముల్లో ఉన్న గత ఖరీఫ్ సీజన్ బియ్యానికే ధరలు రెట్టింపు చేశారు. కిలో రూ.50 నుంచి రూ.60 మించని బియ్యాన్ని రూ.90 నుంచి రూ.100, అంతకన్నా అధిక ధరలకు అమ్ముతున్నారు. మరీ దారుణం ఏంటంటే... చౌకధరల దుకాణాల ద్వారా వినియోగదారులు తీసుకున్న బియ్యాన్ని రూ.20 లోపు కిలో చొప్పున కొనుగోలు చేసి, అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి రూ.80 నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.
కరువు నేపథ్యంలో బియ్యానికి డిమా ండ్ పెరిగిందని ప్రచారం చేస్తూ, మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, బియ్యం డిపోల యజమానులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, పాలిష్ పట్టించి, పేరున్న బ్రాండ్ల సంచుల్లో నింపి సన్న బియ్యంగా డిపోలకు సరఫరా చేస్తున్నారు. పౌరసర ఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు గురువారం హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో ఈ దందా బట్టబయలైంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం, తూనికలు కొలతల శాఖ, జీఎస్‌టీ, పోలీసులతో ఉదయం 9 గంటల నుంచి 20 బృందాలతో దాడులు నిర్వహించి మిల్లర్లు, వ్యాపారుల గుట్టును రట్టు చేశారు.
క్వింటా రూ.5,400.. అమ్మేది రూ.10 వేలకు
⇒ గత ఖరీఫ్ సీజన్‌లో పండించిన పంటకు సంబంధించి క్వింటాల్ బియ్యాన్ని రూ.4,000 నుంచి రూ.5000 వరకు విక్రయించారు. గత జూలై నెల వరకు కూడా బియ్యం ధర సుమారు రూ.5,400 నుంచి సూపర్‌ఫైన్ బియ్యం రూ.6000లోపే ఉంది. కానీ ఆ సీజన్ బియ్యం ఆగస్టు నుంచి ధర పెరుగుతూ వచ్చి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.9,000 నుంచి రూ.9,500లకు చేరింది. కొన్ని రకాలు కిలో రూ.55 నుంచి రూ.80–85కు చేరాయి.
జై శ్రీరామ్ వంటి సన్నరకాలు కిలో రూ.100 దాటాయి. నగరంలోని మౌలాలిలో బుధవారం ఓ బ్రాండ్ సన్న బియ్యం కిలో రూ.101కి అమ్ముడైంది. హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్) రకాలు క్వింటా రూ.9 వేలు దాటాయి. హోల్‌సేల్, రిటైల్ ధరల మధ్యే కిలోకు రూ.5 నుంచి రూ.20 వరకు తేడా ఉంటోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యే రాష్ట్రంలో బియ్యం చిల్లర ధరలు 13.3 శాతం పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
రేషన్ బియ్యానికి కొత్త రంగు
⇒ పౌరసరఫరాల శాఖ జరిపిన తనిఖీల్లో అత్యంత విస్తుపోయే అంశం రేషన్ బియ్యం రీసైక్లింగ్. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రేషన్ కార్డుదారుల నుంచి రూ.15 నుంచి రూ.20కి కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి, ఇబ్రహీంపట్నంలోని ఓ మిల్లుల్లో రీ సైక్లింగ్ చేసి, జైశ్రీరాం, కర్నూలు సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ పేర్లతో వివిధ బియ్యం బ్రాండ్‌ల 26 కిలోల సంచుల్లో నింపినట్టు తేలింది. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగల్‌పల్లి, శేరిగూడ, పోచారం, యాచారం ప్రాంతాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్ అయిన బియ్యం కార్పొరేట్ బ్రాండ్లను పోలిన పేర్లతో సంచుల్లో నింపి డిపోలకు పంపుతున్నారు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ తనిఖీల్లో మిల్లుల్లో ఉన్న బియ్యం సంచులే కర్మన్‌ఘాట్ బియ్యం డిపోల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు.
కర్మన్‌ఘాట్‌లో షట్టర్లు మూసి పరార్
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లోని పలు బియ్యం డిపోలపై పౌరసరఫరాల, విజిలెన్స్ అధికారులు గురువారం బృందాలుగా ఏకకాలంలో దాడులు చేసి నిల్వలు, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రేషన్ బియ్యం కలిపారా లేదా తేల్చేందుకు పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అధికారులు వస్తున్నారని తెలియగానే కొందరు డిపోల నిర్వాహకులు షట్టర్లు దించి వెళ్లిపోయారు. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.
26 కిలోల ట్యాగ్‌తో 25 కిలోల బియ్యం విక్రయాలు.. జీఎస్‌టీ ఎగవేత
బియ్యం తూకంలోనూ మిల్లర్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. సంచులపై 26 కిలోలు అని ట్యాగ్ వేసి లోపల 25 కిలోల బియ్యమే నింపుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరికొన్నిచోట్ల 25 కిలోల సంచుల్లో 23–24 కిలోలే ఉంటున్నాయని అధికారులు గుర్తించారు. 25 కిలోల బియ్యం సంచులకు జీఎస్‌టీ 5 శాతం చెల్లించాల్సి వస్తున్నందున 26 కిలోల ట్యాగ్ వేస్తే జీఎస్‌టీ ఉండదు. అమ్మకాలకు బిల్లులు ఇవ్వకుండా, లెక్కల్లో చూపకుండా జీఎస్టీ ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల్లో బయటపడిన ఈ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్థాయిలో సాగుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.


