హిందీ పలు షోలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటుడు అనుజ్ ఠాకూర్ (33) చనిపోయాడు. అక్టోబర్ 27న నిద్రలోనే ఆయనకు ఫిట్స్ (సీజర్) రావడంతో మృతి చెందాడు. ధూమ్ మచావో ధూమ్, బంధన్ సాత్ జన్మో కా, బీంద్ బనూంగా ఘోడి చఢూంగా, మహిసాగర్ తదితర సీరియల్స్ చేసిన అనుజ్ మరణవార్తని స్నేహితుడు, సహనటుడు రూపేష్ సోనార్ ధ్రువీకరించాడు. అక్టోబర్ 30న అనుజ్‌కు నివాళులర్పిస్తూ రూపేష్ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
అనుజ్ కుటుంబ సభ్యులని కలిసిన తర్వాత నిద్రలో అతడికి ఫిట్స్ రావడంతోనే చనిపోయినట్లు తనకు తెలిసిందని రూపేష్ వెల్లడించారు. "నువ్వు ఇక లేవంటే నమ్మలేకపోతున్నా. నువ్వు స్నేహితుడివి మాత్రమే కాదు. నా తమ్ముడిలాంటి వాడివి. మనం కలిసి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. జీవితం ఎంత అనూహ్యమైనదో కదా! ఇంత చిన్న వయసులోనే నువ్వు దూరమయ్యావన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఈ వార్త ఇప్పటికీ నిజమనిపించడం లేదు. నువ్వు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటావు సోదరా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి" అని రూపేష్ భావోద్వేగానికి గురయ్యాడు.
2008లో వచ్చిన 'బంధన్ సాత్ జన్మో కా' సీరియల్‌తో రూపేష్-అనూజ్ స్నేహం మొదలైంది. తర్వాత 'బీంద్ బనూంగా ఘోడి చఢూంగా' సహా పలు సీరియల్స్‌లో కలిసి పనిచేశారు. అనుజ్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన రూపేష్.. అతడిని 10 రోజుల క్రితమే కలిశానని చెప్పుకొచ్చాడు. అనుజ్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచేవారని.. రోజూ జిమ్, జాగింగ్ చేసేవారని.. సంఘటన జరిగిన రోజు ఉదయం 4:30 గంటలకు అలారం మోగినా అనుజ్ నిద్రలేవలేదు. దీంతో తల్లి అతడి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే అనుజ్ మరణించినట్లు గుర్తించారు. అనుజ్.. సీరియల్స్‌లో కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఇలా జరగడం విషాదాన్ని నింపింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలో సంచలనం.. కూతురి ప్రేమ.. వచ్చి తీసుకెళ్లిపోయిన పేరెంట్స్)


