టాలీవుడ్‌ని గత కొన్నేళ్లలో మీరు గమనిస్తే చాలామంది దర్శకులు త్వరగా సినిమాలు తీయలేకపోతున్నారు. అదేమంటే ఫెర్ఫెక్షన్, పాన్ ఇండియా అని కబుర్లు చెబుతున్నారు. పోనీ రిలీజ్ తర్వాత సదరు మూవీస్ బ్లాక్‌బస్టర్ అవుతున్నాయా అంటే ప్రేక్షకుల కంటే ట్రోలర్స్‌కే పనికొస్తున్నాయి. మరోవైపు టైంకి ప్రింట్ సిద్ధం కాకపోవడంతో సెన్సార్ దగ్గర కూడా సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్.. నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
సినిమా సర్టిఫికేషన్ విషయమై చివరి నిమిషంలో హడావుడి చేసే నిర్మాతలు, దర్శకులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కీలక సూచనలు జారీ చేసింది. మూవీ విడుదల తేదీ దగ్గర పడిందని హడావుడి చేసినంత మాత్రాన సర్టిఫికేషన్ ప్రక్రియని వేగవంతం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అన్ని విధాలా పూర్తయిన చిత్రాలనే సర్టిఫికేషన్ కోసం సమర్పించాలని స్పష్టం చేసింది.
సర్టిఫికేషన్ కోసం సమర్పించే సినిమాలో ఫైనల్ గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్స్, సెన్సార్ సర్టిఫికెట్ స్లేట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సహా అన్ని అంశాలు పూర్తిగా ఉండాలి.
ఫైనల్ థియేట్రికల్ వెర్షన్‌లో అవసరమైన చోట క్లోజ్డ్ క్యాప్షన్స్, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ వంటి సౌకర్యాలను చేర్చాలి.
దరఖాస్తులో పేర్కొన్న సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లు, టీజర్లు, ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించే టైటిల్స్ కూడా దరఖాస్తు చేసినంత మాత్రాన అవి ఉంటాయనే గ్యారంటీ లేదు. సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జామినింగ్ కమిటీ లేదా రివైజింగ్ కమిటీ సినిమా టైటిల్స్‌ని పరిశీలించి, అవసరమైతే మార్పులు సూచించొచ్చు.
గ్రాఫిక్స్, తాత్కాలిక సంగీతం, అసంపూర్తి ప్రింట్లు లాంటి అంశాలు లేకపోవడం తదితర కారణాలతో దరఖాస్తులని నిబంధనలకు విరుద్ధమైనవిగా పరిగణించే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తవకపోతే దరఖాస్తులను తిరిగి పంపించడం, తిరస్కరించడం లేదా ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశముంది.
సినిమా, ట్రైలర్ లేదా టీజర్ విడుదల తేదీ దగ్గరగా ఉందనే కారణంతో సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కుదరదు. మూవీలో మార్పులు, సవరణలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సెన్సార్ బోర్డ్ నిర్దేశించిన నిబంధనలు, గడువు ప్రకారమే కొనసాగుతాయి.
సినిమా విడుదలకు తగినంత ముందుగానే సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్మాతలు, దరఖాస్తుదారులకు సెన్సార్ బోర్డ్ సూచించింది. తద్వారా పరిశీలన, కమిటీ సమీక్ష, అవసరమైన మార్పులకు సరిపడా సమయం దొరుకుతుంది. సినిమాటోగ్రఫీ చట్టం 1952, సినిమాటోగ్రాఫీ రూల్స్ 2024తో పాటు ఇతర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని బోర్డ్ స్పష్టం చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


