‘ఉయ్ వేర్ హియర్’ పోస్టర్
ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘ఉయ్ వేర్ హియర్’ ఆస్కార్ రేసులో నిలిచింది. అరిందోల్ బాగ్చి, దేవేంద్ర డోడ్కే, కల్పనా గగ్డేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ఇది. ప్రణవ్ భాసిన్ దర్శకత్వం వహించారు. పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫెస్ట్, క్లెర్మాంట్–ఫెర్రాండ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్... ఇలా దాదాపు 80 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ షార్ట్ ఫిల్మ్ సుమారు 20 అవార్డులను గెలుచుకుంది.
పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫెస్ట్‌లో అవార్డును సాధించడంతో ‘బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం ఈ సినిమా అర్హత సాధించింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రియాంక చోప్రా జోనాస్, హాలీవుడ్ నటుడు ఆండ్రూ స్కాట్ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయనే భయంతో ముగ్గురు రిటైర్డ్ వ్యక్తులు నిరసన తెలపడానికి సిద్ధం అవుతారు.
ఇదే సమయంలో ఈ ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగుల్లోని ఒకరి కొడుక్కి ఏఐ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. కానీ తన తండ్రి చేత నిరసనను మాన్పిస్తేనే ఆ కొడుక్కి ఆ ఉద్యోగం ఖరారవుతుంది. మరి... ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ షార్ట్‌ఫిల్మ్ కథాంశం. 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చిలో జరగనుంది.


