దీపావళి ఎఫెక్ట్: విషవాయువుల కోరల్లో ఢిల్లీ | Delhis air quality in very poor category amid Diwali celebrations | Sakshi
Sakshi News home page

దీపావళి ఎఫెక్ట్: విషవాయువుల కోరల్లో ఢిల్లీ

Nov 9 2026 6:55 AM | Updated on Nov 9 2026 7:12 AM

Delhis air quality in very poor category amid Diwali celebrations

న్యూఢిల్లీ: దీపావళి వేడుకలు దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య కోరల్లోకి నెట్టాయి. ఆదివారం రాత్రి ప్రజలు టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత మరింత దిగజారింది. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)371కి చేరింది. దీంతో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. నగరంలోని మొత్తం 59 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో 19 చోట్ల ఏక్యూఐ ‘సీవియర్’ స్థాయికి చేరింది. మరో ఏడు కేంద్రాల్లో ‘పూర్’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘వెరీ పూర్’ స్థాయిలో నమోదైంది. జహంగీర్‌పురిలో అత్యధికంగా 460 ఏక్యూఐ నమోదైంది. ఆదివారం ఢిల్లీ సగటు ఏక్యూఐ 376గా నమోదైంది. శనివారం ఇది 369గా ఉండటం గమనార్హం. దీపావళి టపాసుల పొగతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, హర్యానా, పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల సోమవారం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమల్లోకి గ్రాప్‌-3 ఆంక్షలు
శీతాకాలంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్‌) మూడో దశను అమల్లోకి తెచ్చింది. ఏక్యూఐ 401-500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను అమలు చేస్తారు. ఇందులో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.

అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచే వాహనాల ప్రవేశం, నిర్మాణ పనులపై కొన్ని నిబంధనలు అమల్లోకి రాగా.. గ్రాప్‌-3తో ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. కాలుష్యం మరింత పెరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement