పశ్చిమాసియాలో మళ్లీ రగడ! | Iranian attack drones downed by US military | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో మళ్లీ రగడ!

Nov 14 2026 2:23 AM | Updated on Nov 14 2026 2:23 AM

Iranian attack drones downed by US military

ఇరాన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటన  

బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ వ్యవస్థపై దాడి చేశామన్న ఐఆర్‌జీసీ  

దుబాయ్‌: పశ్చిమాసియాలో మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. బహ్రెయిన్‌ వైపు దూసుకొస్తున్న రెండు ఇరాన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం శుక్రవారం ప్రకటించింది. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు గానీ లేదా ఆస్తి నష్టం గానీ జరగలేదని పేర్కొంది. బహ్రెయిన్‌లో అమెరికాకు చెందిన ముందస్తు హెచ్చరికల రాడార్‌ వ్యవస్థపై తాము దాడి చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) వెల్లడించింది. 

దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌ ఓడరేవులో ఒక టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థపై అమెరికా దాడి చేసిన తర్వాత అమెరికా రాడార్‌ వ్యవస్థను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు తేల్చిచెప్పింది. అయితే, బహ్రెయిన్‌లో రాడార్‌ వ్యవస్థపై దాడి చేశామన్న ఐఆర్‌జీసీ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. పశ్చిమాసియాలో అమెరికా అనుకూల దేశం బహ్రెయిన్‌. ఇక్కడ అమెరికాకు అతిపెద్ద నావికాదళం ఉంది. 

రాడార్‌పై జరిగిన దాడి ఘటన అమెరికాకు పంపిన తీవ్ర హెచ్చరిక అని ఐఆర్‌జీసీ పేర్కొంది. సెపె్టంబర్‌ తర్వాత బహ్రెయిన్‌లోని ఒక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ వెల్లడించడం ఇదే మొదటిసారి. మరోవైపు హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్న ఒక ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ ట్యాంకర్‌ సముద్ర మందుపాతరను ఢీకొనడంతో పేలుడు సంభవించిందని ఐఆర్‌జీసీ తెలిపింది. జలసంధి తూర్పు భాగం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ నౌకకు పదేపదే ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదని పేర్కొంది. 

అప్పటి అమర జవాన్ల పార్థివదేహాలకు అంత్యక్రియలు  
ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధం ముగిసిన 38 ఏళ్ల తర్వాత శుక్రవారం వందలాది మంది గుర్తుతెలియని సైనికుల పార్థివదేహాలను ఇరాన్‌ నగరాల గుండా ఊరేగించారు. టెహ్రాన్‌లో 110 మంది సైనికుల పార్థివ దేహాల ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. మరో 240 మందికి ఇతర నగరాల్లో అంత్యక్రియలు జరిగాయి. ఈ పార్థివ దేహాలను ఇటీవల పూర్వ యుద్ధభూముల నుంచి వెలికితీశారు. 

గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. ముగ్గురి మృతి 
సెంట్రల్‌ గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం దాడులకు దిగింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అల్‌–అక్సా మారి్టర్స్‌ ఆసుపత్రికి చెందిన అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక పురుషుడు, ఒక మహిళ, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్లు చెప్పారు.

 డైర్‌ అల్‌–బలాహ్‌ నగరానికి తూర్పు ప్రాంతంలో జరిగిన మరో దాడిలో 20 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువమంది పిల్లలేనని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, గాజాలో 9 నెలల శిశువు ఒకరు తీవ్రమైన చలి (హైపోథెరి్మయా) కారణంగా మరణించాడని, ఈ శీతాకాలంలో చలి వల్ల సంభవించిన మొదటి మరణం ఇదేనని గాజా అధికారులు శుక్రవారం తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement