ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వివరణ
పాస్‌పోర్టు వివరాల్లో తేడాలున్నాయని వెల్లడి
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నేత సౌరవ్ దాస్‌కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ ఒకటి ఉండటంతోనే అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో లండన్ వెళ్లబోయే ముందు అడ్డుకున్నారని కేంద్రం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. తన ప్రయాణాన్ని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ సౌరవ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా కేంద్రం లుకౌట్ సర్క్యులర్ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ తొమ్మిదిన జరగనుంది. సౌరవ్ దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. లుకౌట్ సర్క్యులర్ గురించి తమకు ఏమాత్రం సమాచారం లేదని, ఏ కారణంతో ఇచ్చారో కూడా తెలియదని తెలిపారు. ఆ సర్క్యులర్ కాపీ ఇవ్వాలని కోరగా కేంద్రం తరఫు న్యాయవాది నిరాకరించారు.
మహారాష్ట్ర పోలీసుల అభ్యర్థనల మేరకు నవంబర్ 22–23 లో లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. దాస్ ఇప్పుడు దాన్ని తగిన వేదికపై సవాలు చేయవచ్చునని సూచించారు. అంతేకాకుండా సౌరవ్‌దాస్‌కు నవంబరు 23న షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామని, దానికి ఇంకా సమాధానం రావాల్సి ఉందని చెప్పారు. సౌరవ్‌దాస్ వేసిన పిటిషన్‌పై చాలా అభ్యంతరాలున్నాయని, విచారణకు అర్హం కాదని చెప్పారు. షోకాజ్ నోటీసును ప్రస్తావిస్తూ.. పాస్‌పోర్టు వివరాల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో విచారణ పూర్తయ్యేంతవరకూ ప్రయాణాలు చేయవద్దని సలహా ఇచ్చామని వాస్తవానికి ఇది సౌరవ్‌దాస్‌కు అనుకూలమైందేనని అన్నారు.
ఆగస్టు 20న దాస్ ఇచ్చిన వివరాల్లో కొన్ని స్పష్టమైన లోటుపాట్లు ఉన్నాయని, దీనిపై పుదుచ్చెరిలో విచారణ ప్రారంభమైందని తెలిపారు. దాస్ పుట్టిన ప్రాంతం, చిరునామా, తల్లిదండ్రుల వివరాలు నిర్ధారించుకుంటున్నామన్నారు. దాస్ తన దరఖాస్తులో తండ్రి అన్న కాలమ్‌ను ఖాళీగా ఉంచారని చెప్పారు. అతడి పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తూ కానీ చెల్లదని కానీ ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. దాస్ నవంబరు 24న షోకాజ్ నోటీసుకు స్పందించాల్సి ఉండగా ఆయన కోర్టులో పిటిషన్ వేసేందుకు ఆసక్తి చూపారని చెప్పారు. సౌరవ్ దాస్ ఇచ్చిన వివరాల్లోని తేడాలు అతడి పౌరసత్వంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని చెప్పారు.
యూపీ సరిహద్దుల్లో మళ్లీ అడ్డగింత...
పోలీసులు గురువారం తనను మరోసారి యూపీ సరిహద్దులో అడ్డుకున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ నేత సౌరవ్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీరట్‌లో అంబేడ్కర్‌కు నివాళులు అర్పించేందుకు వెళుతూండగా పోలీసులు అడ్డుకున్నారని, ముందుకు వెళ్లేందుకు అనుమతించడం లేదని ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. బాబా సాహెబ్‌కు పుష్పాంజలి ఘటించడం కూడా యూపీలో నేరం అయిపోయిందా? అని ప్రశ్నించారు.


