తిరుప్పరకుండ్రంలో టెన్షన్‌.. టెన్షన్‌! | Supreme Court Orders Lighting of Karthigai Deepam at Tirupparankundram Hill | Sakshi
Sakshi News home page

తిరుప్పరకుండ్రంలో టెన్షన్‌.. టెన్షన్‌!

Nov 28 2026 7:39 AM | Updated on Nov 28 2026 7:39 AM

Supreme Court Orders Lighting of Karthigai Deepam at Tirupparankundram Hill

సాక్షి, చెన్నై: తిరుప్పరకుండ్రం కొండ దీప స్తంభంపై శనివారం కార్తీక దీపం వెలిగించాల్సిందేని సుప్రీం కోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో తమిళనాట ఉత్కంఠ నెలకొంది. దీపం వెలిగేనా అని బీజేపీ సహా హిందూ సంఘాలు ఎదురుచూస్తుండగా, కోర్టు తీర్పుపై వామపక్షాలు, వీసీకేలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశాయి. తిరుప్పరకుండ్రం దీపం వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా తమిళనాడు యంత్రాంగం తీరుపై నిప్పులు చెరిగిన ధర్మాసనం, కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ అధికారులతో సంప్రదించి శనివారం దీపం వెలిగించాల్సిందేని, కొండపై ఉన్న దర్గాకు 50 మీటర్ల దూరంలో భక్తులు కూడా దీపాలు వెలిగించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు సీఆర్‌పీఎఫ్‌ భద్రతను కల్పి­స్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలను బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆహ్వానించాయి. సీపీఎం, సీపీఐ, వీసీకే ఇది ఆమోదయోగ్యం కాదని స్పందించాయి. 

నేడు అప్పీలుకు..?
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం విజయ్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై శనివారం అప్పీలుకు వెళ్లే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. సున్నితమైన అంశాన్ని కోర్టుకు వివరించే దిశగా ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుప్పరకుండ్రంతోపాటు మదురై నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement