‘హనుమాన్‌ అంశ్‌’ ‍ప్రభావం.. కైంచీ ధామ్‌లో అనూహ్య రద్దీ! | Hanuman Ansh effect Unpredictable rush at Kainchi Dham | Sakshi
Sakshi News home page

‘హనుమాన్‌ అంశ్‌’ ‍ప్రభావం.. కైంచీ ధామ్‌లో అనూహ్య రద్దీ!

Oct 4 2026 11:09 AM | Updated on Oct 4 2026 11:24 AM

Hanuman Ansh effect Unpredictable rush at Kainchi Dham

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త నీమ్‌ కరోలీ బాబా జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా విపరీతమైన జనాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు ఉత్తరాఖండ్‌లోని కైంచీ ధామ్‌ సందర్శనకు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో జనాలు కిక్కిరిసి  ఉంటడం, ఒకరినొకరు దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కైంచీ ధామ్ భక్తులతో కిటకిటలాడుతోంది. బాబా నీమ్ కరోలీ మహరాజ్ మహిమలు, ఆంజనేయ స్వామి తత్వాన్ని చాటిచెప్పిన ‘హనుమాన్ అంశ్‌’ సినిమా ప్రభావంతో దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తింది. ప్రస్తుతం వరుస సెలవులు కలిసిరావడంతో బాబా దర్శనం కోసం భక్తులు, పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం ఎదుట బారులు తీరారు.

‘హనుమాన్ అంశ్‌’ సినిమా ప్రభావంతో ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల తాకిడి సాధారణం కంటే రెట్టింపు అయ్యింది. దీంతో నైనీతాల్ కొండ రహదారులు పూర్తిగా వాహనాలతో స్తంభించిపోయాయి. భవాలీ నుంచి కైంచీ ధామ్, గరమ్‌పానీ మీదుగా ఖైర్నా వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ప్రయాణికులు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌‌లోనే నిరీక్షించాల్సి వస్తున్నది.

అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు శని, ఆదివారాలు కలిసి రావడంతో  యువత, కుటుంబాలు సైతం ఉత్తరాఖండ్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక్క నైనీతాల్, కైంచీ ధామ్ పరిసరాలకే దాదాపు 12 వేల మందికి పైగా చేరుకున్నారు. కైంచీ ధామ్‌తో పాటు భీమ్‌తాల్, ముక్తేశ్వర్, రిషికేశ్, చార్‌ధామ్ మార్గాల్లోనూ పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో పోలీసులు, స్థానిక అధికారులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు చేస్తున్నారు. రూట్ డైవర్షన్లు, ప్రత్యేక షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ వ్యక్తిగత వాహనాలతో రోడ్లపై  రద్దీ ఏ‍ర్పడుతోంది. భక్తులు తమ సొంత వాహనాలతో నేరుగా ఆలయం సమీపానికి రాకుండా, నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు ఉంచి, షటిల్ సర్వీసులను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: హసీనా రాక వెనుక.. భారత్‌ కీలక వివరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement