విద్యార్థి జీవితంలో చదువు, పరీక్షలు, భవిష్యత్ లక్ష్యాలు ఎంతో ముఖ్యమైనవే. అయితే వాటితో పాటు పెరుగుతున్న పోటీ, ఆశించిన మార్కులు రాకపోవడం, ఉద్యోగ అవకాశాలపై ఆందోళన, కుటుంబ సమస్యలు, స్నేహ సంబంధాలలో ఇబ్బందులు, వ్యక్తిగత లక్ష్యాలు నెరవేరకపోవడం వంటి అంశాలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతి పరీక్షలోనూ అత్యధిక మార్కులు సాధించాలనే ఒత్తిడి, ఇతర విద్యార్థులతో తమను తాము పోల్చుకోవడం; తల్లిదండ్రులు, సమాజం నుంచి వచ్చే అంచనాలు కొంతమంది విద్యార్థుల్లో ఆందోళన, భయం, నిరాశ వంటి భావోద్వేగాలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా తమ సమస్యలను తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో లేదా స్నేహితులతో పంచుకోకుండా ఒంటరిగా బాధపడే విద్యార్థులు కూడా ఉన్నారు. సమస్యలను మనసులోనే దాచుకోవడం వల్ల అవి మరింత తీవ్రతరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థులు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, భయాలు, సందేహాలు, సమస్యలను విశ్వసనీయ వ్యక్తులతో స్వేచ్ఛగా పంచుకోవడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహాయం కోరడం బలహీనత కాదు, సమస్యను ఎదుర్కొనే ధైర్యానికి అది ఒక సూచిక. ప్రతిరోజూ కొంత సమయాన్ని శారీరక వ్యాయామం, యోగా లేదా ధ్యానానికి కేటాయించడం, తగినంత నిద్రపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించుకోవడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి.
చదువును చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవడం, సమయపాలన పాటించడం, పరీక్షల సమయంలో పునశ్చరణకు సరైన ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా కూడా చదువు సంబంధిత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పరీక్షల్లో ఒకసారి ఆశించిన మార్కులు రాకపోవడం జీవితానికి ముగింపు కాదని, అది భవిష్యత్తులో మెరుగుపడేందుకు ఒక అనుభవంగా చూడాలని విద్యావేత్తలు విద్యార్థులకు సూచిస్తున్నారు.
ప్రతి విద్యార్థికీ ప్రత్యేకమైన ప్రతిభ, ఆసక్తులు, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరి మార్కులను మరొకరితో పోల్చడం కంటే వారి ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థుల విజయాన్ని కేవలం మార్కులతోనే కొలవకూడదు. వారి వ్యక్తిత్వం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక నైపుణ్యాలు, భావోద్వేగ సమతుల్యత కూడా భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయి.
– వి.వి. వరప్రసాద్ పెసల, డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్, డా‘‘ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా


