ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు! | South Korean Tycoon Ordered to Pay Ex Wife 1 87 Billion Dollars in Record Divorce Settlement | Sakshi
Sakshi News home page

ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు!

Sep 10 2026 5:07 PM | Updated on Sep 10 2026 5:26 PM

South Korean Tycoon Ordered to Pay Ex Wife 1 87 Billion Dollars in Record Divorce Settlement

సోషల్ మీడియాలో ఓ విడాకుల కేసు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంపెనీ స్మైల్‌గేట్ వ్యవస్థాపకుడు క్వాన్ హ్యూక్-బిన్‌కు సంబంధించిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

క్వాన్ హ్యూక్-బిన్‌.. తన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు 2.55 ట్రిలియన్ వాన్ విలువైన ఆస్తులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.18 వేలకోట్లు. దీంతో ఇది దక్షిణ కొరియా చరిత్రలో అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్‌గా నిలిచింది. గతంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం చెయ్ టే-వోన్ తన మాజీ భార్యకు 944 బిలియన్ వాన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఎవరీ క్వాన్ హ్యూక్-బిన్?
క్వాన్ హ్యూక్-బిన్ దక్షిణ కొరియాలోని ప్రముఖ బిలియనీర్‌లలో ఒకరు. ఆయన స్థాపించిన స్మైల్‌గేట్ దేశంలోని అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీల్లో ఒకటి. క్రాస్‌ఫైర్, లాస్ట్ ఆర్క్ వంటి ప్రముఖ గేమ్స్ ఈ కంపెనీకి చెందినవే. బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం క్వాన్ సంపద సుమారు 3 బిలియన్ డాలర్లు.

కోర్టు తీర్పు
కోర్టు తీర్పు ప్రకారం, స్మైల్‌గేట్‌లో క్వాన్‌కు ఉన్న 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు బదిలీ చేయాలి. ఈ వాటా విలువ సుమారు 2.5 ట్రిలియన్ వాన్స్. అంతే కాకుండా అదనంగా మరో 65 బిలియన్ వాన్ నగదుగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

క్వాన్, లీ హ్వా-జిన్‌లు 2001లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే అంటే 2002లో క్వాన్ స్మైల్‌గేట్‌ను స్థాపించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసిన సమయంలో లీ కంపెనీలో 50 శాతం వాటాను కోరారు. కంపెనీ ప్రారంభ సమయంలో తాను ఆర్థికంగా సహాయం చేశానని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. అంతేకాదు.. వివాహం తర్వాత రెండు దశాబ్దాలకు పైగా తాను పిల్లలను పెంచడం, కుటుంబ బాధ్యతలను చూసుకోవడంలో గడిపానని లీ పేర్కొన్నారు. కంపెనీ ఏర్పడిన సమయంలో తాను చేసిన సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

అయితే.. క్వాన్ మాత్రం ఆమె కంపెనీలో పెట్టుబడి పెట్టలేదని, కంపెనీ కోసం పనిచేయలేదని వాదించారు. స్మైల్‌గేట్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఓ ప్రకటన చేస్తూ, కంపెనీ ప్రారంభానికి అవసరమైన మొత్తం పెట్టుబడిని క్వాన్ ఒక్కడే సమకూర్చారని తెలిపింది. అయినప్పటికీ.. కోర్టు తాజాగా లీకి భారీ మొత్తంలో ఆస్తులు, కంపెనీ వాటా ఇవ్వాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు దక్షిణ కొరియాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement