సినిమా వాళ్ల జీవితం మన ఊహించనంతగా ఉండదు. గ్లామర్ ఫీల్డ్ రంగుల ప్రపంచమే అయినప్పటికీ.. వాళ్ల జీవితంలో అలాగే ఉంటుందనుకుంటే తొక్కపై కాలేసినట్లే. అందరి లైఫ్ లగ్జరీగా ఉంటుందనుకుంటే పొరపాటే. వెండితెరపై కనిపించినంత కలర్‌ఫుల్‌గా వ్యక్తిగత జీవితం ఉండదు. అలాంటి కథే ఈ మలయాళ స్టార్ హీరోయిన్ చర్మిలాది. సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. రియల్ లైఫ్‌లో మాత్రం దారుణ పరిస్థితులు ఎదుర్కొంది.
తమిళనాడులో జన్మించిన చర్మిలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. శివాజీ గణేషన్ నటించిన ‘నల్లతోరు కుటుంబం’ (1979) చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రం ‘ఒయిలట్టం’ (1991)తో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే చర్మిలకు మోహన్‌లాల్ సరసన వరుస చిత్రాలలో నటించే అవకాశం లభించింది. ధనం(1991), అంకుల్ బన్ (1991) చిత్రాలు ఆమెను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత కేలి మూవీతో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అంతేకాకుండా 90 దశకంలో తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు.
రియల్ లైఫ్‌లో ఫెయిల్..
సినిమాల్లో స్టార్‌గా ఎదిగిన చర్మిలా మాత్రం రియల్ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోయింది. బాబు ఆంటోనీతో మొదలైన ఆమె ప్రేమ ప్రయాణం.. ఆ రిలేషన్ విచ్చిన్నం కావడంతోనే మొదలైంది. ఆ తర్వాత ఆమె జీవితం మరింత పతనమైంది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికీ విడాకులు తీసుకుంది.
మలయాళంలో 'కడల్' (1994) అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ మూవీలో బాబు కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడే వారిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారు 'రాజధాని', 'కంబోలం' వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నప్పటికీ.. చివరికి విడిపోయారు. తన తండ్రికి బాబు అంటే అస్సలు ఇష్టం లేదని ఆమె ఒకసారి వెల్లడించారు. నా తండ్రి కఠిన వైఖరే తనను బాబుకు మరింత దగ్గర చేసిందని ఆమె పేర్కొంది.
కిషోర్ సత్యతో సీక్రెట్ పెళ్లి..
అయితే బాబు ఆంటోనీతో విడిపోయాక.. అప్పట్లో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నటుడు కిషోర్ సత్యకు ఆమె దగ్గరైంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లే ఆమె సినీ కెరీర్ పతనానికి నాంది పలికింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని కిషోర్ నన్ను అడిగాడని చెప్పింది. ఆ తర్వాత కిషోర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అలా నాలుగేళ్లపాటు అతను అక్కడ.. నేను ఇక్కడ ఉన్నామని తెలిపింది. ఒక షో కోసం నేను దుబాయ్ వెళ్లి అతన్ని కలిశా.. ఈ మన బంధాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని కిషోర్ చెప్పిన విషయాన్ని చర్మిల గుర్తుచేసుకుంది. కేవలం నా పాపులారిటీ వల్లే నన్ను పెళ్లి చేసుకున్నాడని గ్రహించి..ఆ తర్వాత మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని వెల్లడించింది.
రెండో పెళ్లి కూడా..
ఒక పెళ్లి విఫలమైనప్పటికీ.. చర్మిల మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన రాజేశ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడింది. అతను చర్మిల సోదరి ఫ్రెండ్ కావడం విశేషం. అయితే మా ఇద్దరికీ ఓ కుమారుడు జన్మించాడు. అయితే నేను క్రిస్టియన్ కావడంతో తన కొడుకు కూడా అదే మతం అనుసరించాలని కోరుకున్నా..కానీ రాజేశ్ హిందూ మతంలోకి మారాలని కోరడంతో మా ఇద్దరికీ విభేదాలొచ్చాయని తెలిపింది. దీంతో మేము చట్టపరంగా విడాకులు తీసుకున్నామని తెలిపింది. అయినప్పటికీ అతనితో టచ్‌లో ఉన్నాం.. కోర్టు విచారణ సమయంలో నా కొడుకు నాతో ఉండాలనుకుంటున్నానని చెప్పాడని.. రాజేశ్ తరచుగా నా కొడుకును కలవడానికి వస్తుంటాడని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలలో లేనప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆమె పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించారు.


