దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారానికి తెరతీసిన టీడీపీ నేతలు | Vijayawada: Municipal Commissioner Orders Defied as TDP Leaders | Sakshi
Sakshi News home page

దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారానికి తెరతీసిన టీడీపీ నేతలు

Sep 14 2026 2:49 PM | Updated on Sep 14 2026 3:04 PM

Vijayawada: Municipal Commissioner Orders Defied as TDP Leaders

సాక్షి,విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలను అడ్డుపెట్టుకుని అధికార టీడీపీ నేతలు నిబంధనలను గాలికొదిలేశారు. ప్రజల భద్రత దృష్ట్యా  మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకు తిలోదకాలిచ్చారు. దేవుడి పేరుతో ఇష్టానుసారంగా వ్యాపారాలకు తెరతీశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడలోని సితార సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్స్‌లో గణపతి ఉత్సవాల మాటున ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ప్రజల భద్రత,రద్దీ నియంత్రణను పరిశీలించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్.. ఆ ప్రాంతంలో ఎగ్జిబిషన్లు, ఫుడ్ కోర్ట్స్‌ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. కేవలం వినాయక మండప ఏర్పాటుకు, పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి ఎగ్జిబిషన్లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ పేరుతో ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు రద్దయినప్పటికీ గ్రౌండ్‌లో మాత్రం ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు పనులు నిరాటంకంగా కొనసాగుతుండటం గమనార్హం. టీడీపీ నేత డూండీ రాకేష్ ఆధ్వర్యంలోనే ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసి పనులు వేగంగా జరుగుతున్నా, స్థానిక మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేవుడిని అడ్డం పెట్టుకుని తమ స్వార్థం కోసం ప్రజల భద్రతను గాలికి వదిలేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీ నేత డూండీ రాకేష్‌కు ఒక నిబంధనా? సామాన్యులకు మరో నిబంధనా?’ అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ పనులను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement