వైఎస్‌ జగన్‌ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా? | Kommineni Comments On Nara Lokesh Comments | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?

Sep 14 2026 11:10 AM | Updated on Sep 14 2026 11:49 AM

Kommineni Comments On Nara Lokesh Comments

ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు  రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ  పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.

దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే  చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.

నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు  పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!

స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.

అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్‌ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?

అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్‌ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని  ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!

అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు  కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?

పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు  చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు  తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?

ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?

తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు  సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని  జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement