సాక్షి,తిరుపతి : సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానెల్ అమ్మి రూ.6 కోట్లు సంపాదించాడు తిరుపతి యువకుడు.కానీ సీన్ కట్ చేస్తే.. అదే డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ ప్లాన్ చేశారు.అసలు ఏం జరిగిందంటే?
క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్‌ను కోట్లకు విక్రయించి భారీగా డబ్బు సంపాదించిన యువకుడిని, అదే డబ్బుపై కన్నేసిన స్నేహితులే అపహరించిన సంచలన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ అనే యువకుడు ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ ఛానెల్‌ను నార్త్ ఇండియాకు చెందిన ఒక వ్యక్తికి సుమంత్ ఏకంగా రూ.6 కోట్లకు విక్రయించాడు. ఈ భారీ మొత్తానికి సంబంధించిన డబ్బు సుమంత్ వద్ద ఉండటంతో, అతని స్నేహితులే ఆ కోట్ల రూపాయలపై కన్నేశారు.
ఈ నేపథ్యంలోనే సుమంత్‌ను అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి ఒక స్నేహితురాలి సహాయంతో సుమంత్ అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకున్న బాధితుడు ఆగస్టు 28న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, పోలీసు కస్టడీలో వారు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.
నిందితులు ఇచ్చిన సమాచారంతో తాటితోపు వద్ద ఉన్న చందు ఇంట్లో దాచిపెట్టిన రూ. కోటి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. మోహన్, బాలాజీ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతంలు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


