యూకేకు వ్యతిరేకంగా ఓటేసిన మెజారిటీ గ్రామస్తుల
లండన్: ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ యూకేలోని ఒక చిన్న గ్రామం తన నిరసన గళాన్ని బలంగా విన్పించింది. తప్పదనుకుంటే బ్రిటన్ నుంచి వేరుబడి యూరప్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలోని మెజారిటీ ప్రజలంతా ఏకతాటి మీదకొచ్చారు. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో కొనసాగాలా వద్దా అంటూ చేపట్టిన ఒక అనధికారిక రెఫరెండమ్‌లో పిడ్డింగ్టన్ గ్రామానికి చెందిన ప్రజలంతా పాల్గొన్నారు.
ఈ గ్రామ జనాభా కేవలం 350. వీరిలో 311 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 285 మంది యూకే నుంచి విడిపోవాలని ఓటేశారు. 26 మంది బ్రిటన్‌లోనే కొనసాగాలని అనుకూలంగా ఓటేశారు. ‘‘మెజారిటీ ప్రజలు తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటారు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సందేశం కాదు. యావత్ ప్రపంచానికి మేమిచ్చే సందేశం’’ అని అక్కడి గ్రామ కౌన్సిల్ చైర్మన్ టిమ్ మెక్‌నాలీ వ్యాఖ్యానించారు.
గ్రామానికి కేవలం 800 మీటర్ల దూరంలో ఉన్న సైన్యానికి చెందిన ఒక పాత స్థావరాన్ని విదేశీ వలసదారులకు కేటాయించి అక్కడ 1,200 శరణార్థి గృహాలను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తుండటంతో పిడ్డింగ్టన్ గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు వందలాదిగా కొత్తగా ఇళ్లను నిర్మిస్తే ఈ ప్రాంతంలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోతాయని, ఇది స్థానిక మధ్యతరగతి కుటుంబాల కొత్త ఇంటి కలను కాలరాస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వలసదారుల రాకతో ఈ ప్రాంతంలో భద్రత కరువవుతుందని, నేరాలు పెరిగే ప్రమాదముందని వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఈ రెఫరెండమ్ ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని పలువురు అభిప్రాయపడ్డారు. 1940లలో నాజీ జర్మనీ వైమానిక దాడులను బ్రిటన్ సేనలు అడ్డుకున్నట్లే ఇప్పుడు మేం విదేశీ వలసదారుల రాకను అడ్డుకోబోతున్నాం.
మా ముందు తరాల వాళ్లు పోరాడినట్లే మేం సైతం పోరాటం కొనసాగిస్తాం’’అని 76 ఏళ్ల గ్రామçస్తుడు హెర్బెర్ట్ ఓవెన్ చెప్పారు. కానీ స్థానికంగా కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఘటనను ఒక వింతగా కొట్టిపారేశారు. బ్రిటన్ నుంచి ఒక గ్రామం విడిపోయేందుకు సాహసించిన కథతో రూపొందిన ‘పాస్‌పోర్ట్ టు పిమ్లికో’ సినిమాతో ఈ ఘటనను పోల్చిచూస్తున్నారు.


