జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా మహిళల 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత స్ప్రింటర్ సీమా కుమారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రేసును 32:50.05 నిమిషాల్లో ముగించిన సీమా మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ విభాగంలో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి 32:39.18 సమయంతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించగా.. జపాన్ అథ్లెట్ నోజోమి తనకా (32:41.54) రజత పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే రేసులో భారత బృందం రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
రేసు ప్రారంభంలో భారత్ కాస్త వెనుకబడినప్పటికీ.. చివరిలో విశాల్ తెన్నరసు, విత్య రామ్‌రాజ్‌లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో 3:14.46 నిమిషాల్లో పూర్తి చేసి సిల్వర్ మెడల్‌ను దక్కించుకుంది. ఈ రజతంతో కలిపి ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది.


