అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు
4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రెండో స్థానం
10 వేల మీటర్లలో కాంస్యం గెలిచిన సీమా
షూటింగ్ స్కీట్, రోయింగ్‌లలో ఒక్కో కాంస్యం
వుషులో రెండోసారి రోషిబీనాకు రజతమే
ప్రస్తుతం 15వ స్థానంలో భారత్
ఆసియా క్రీడల్లో భారీగా అంచనాలు పెట్టుకున్న అథ్లెటిక్స్‌లో బరిలోకి దిగిన తొలి రోజే రెండు పతకాలతో భారత్ బోణీ చేసింది. గత ఆసియా క్రీడల్లో మన దేశానికి అత్యధికంగా 29 పతకాలు అందించిన అథ్లెటిక్స్‌లో గురువారం రజత, కాంస్యాలు దక్కాయి. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో వెండి దక్కగా, 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారికి కాంస్యం లభించింది.
ఆసియా క్రీడల రోయింగ్ చరిత్రలో తొలిసారి భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ జోడీ పతకం అందించగా... షూటింగ్ స్కీట్‌లో కూడా అనంత్‌జీత్–పరీనాజ్ ద్వయం తొలిసారి కాంస్యం గెలుచుకుంది. వుషు ఫైనల్ ఫైట్‌లో ఓడిన రోషిబీనా దేవి చివరకు రజతంతో సంతృప్తి చెందింది. మొత్తంగా పోటీల ఐదో రోజు మన ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మరోవైపు బాక్సింగ్, జిమ్నాస్టిక్స్‌లలో నిరాశాజనక ఫలితాలు రాగా... హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ లలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ దూసుకుపోతోంది.
స్కీట్‌లో గురి కుదిరె...
భారత్‌కు షూటింగ్‌లో మరో పతకం దక్కింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అనంత్‌జీత్ సింగ్–పరీనాజ్ ధలివాల్ ద్వయం మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత జోడీ 44 పాయింట్లు సాధించింది. బుధవారం కాంస్యాలు గెలిచిన పురుషుల, మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లలో భాగంగా ఉన్న అనంత్‌జీత్, పరీనాజ్‌లకు ఈ క్రీడల్లో ఇది రెండో పతకం కావడం విశేషం.

మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు కమల్‌జీత్ (9వ స్థానం), ఆకాశ్ భరద్వాజ్ (11వ స్థానం), కేదార్లింగ్ (35వ స్థానం) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. టీమ్ విభాగంలో భారత్ 1727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
తాత, ముత్తాతల స్ఫూర్తితో...
పంజాబ్‌లో పటియాలాకు చెందిన 24 ఏళ్ల పరీనాజ్ ధలివాల్ ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు పతకాన్ని గెలుచుకుంది. గత ఆసియా క్రీడల్లో భారత జట్టులో ఉన్నా... త్రుటిలో పతకం చేజారగా, ఇప్పుడు ఆమె తన కల నెరవేర్చుకుంది. మిత్రులు, సన్నిహితులంతా ఆతీ్మయంగా పరీ (దేవకన్య) అని పిలుచుకునే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి షూటింగ్‌పై ఆసక్తి ఉంది. తన తాత, ముత్తాతలు ఇంట్లో గన్స్ ఉంచుకునేవారని, వారు జంతువులను వేటాడిన కథలను వింటూ వచ్చిన ఆమె కూడా అటు వైపు ఆకర్షితురాలైంది.
తన ముత్తాత గుర్‌కీరత్‌పాల్ సింగ్ ధలివాల్ ఈ విషయంలో ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు. అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో స్కూల్‌లోని చదువుతున్నప్పుడే 14 ఏళ్ల వయసులో పరీనాజ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ మొదలు పెట్టింది. తన ఆటకు పదును పెట్టుకున్న ఆమె జూనియర్, సీనియర్ విభాగాల్లో నిలకడగా రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పరీనాజ్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపించాయి. షూటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం ఆమె ముందున్నాయి.
అయితే తనకు నచ్చి న పనే చేస్తానంటూ ఆమె చదువును పక్కన పెట్టి షూటింగ్ వైపు మొగ్గింది. 2019లో స్కీట్‌లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఏడాది ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021 ప్రపంచకప్‌లోనూ పాల్గొన్న పరీనాజ్... తర్వాతి ఏడాది జూనియర్ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో ఉంది. ఇప్పుడు రెండు ఆసియా క్రీడల పతకాలు ఆమె స్థాయిని పెంచాయి.
సత్తా చాటిన సీమా...
మహిళల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ సీమా కుమారి కాంస్యంతో మెరిసింది. సీమా 32 నిమిషాల 50.05 సెకన్లలో పరుగును పూర్తి చేసి మూడో స్థానంతో ముగించింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు 16 ఏళ్ల తర్వాత పతకం దక్కడం విశేషం. బహ్రెయిన్‌కు చెందిన యావి విన్‌ఫ్రెడ్ (32 నిమిషాల 39.18 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, తనకా నొజొమి (జపాన్; 32 నిమిషాల 41.54 సెకన్లు) రజత పతకాన్ని అందుకుంది.
రజతం నిలబెట్టుకున్నారు...
నగోయా: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిక్స్‌డ్ టీమ్ తొలి రజతాన్ని అందించింది. 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మను తెక్కినలిల్, విశాల్ తెన్నరసు, విత్య రామ్‌రాజ్, పూవమ్మ రాజు సభ్యులుగా ఉన్న మన బృందం 3 నిమిషాల 14.46 సెకన్లలో పరుగు పూర్తి చేసింది.

చివరి లెగ్‌లో విత్య దూసుకుపోయి భారత్‌కు పతకం అందించడంలో కీలకపాత్ర పోషించింది. 2023 ఆసియా క్రీడల్లో కూడా ఈ ఈవెంట్‌లో భారత్‌కు రజతమే దక్కింది. బహ్రెయిన్ (3 నిమిషాల 12.87 సెకన్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా, వియత్నాం జట్టు (3 నిమిషాల 14.54 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది.
‘చంబా’కీ రాణి
పేదరిక నేపథ్యం... 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడిన కుటుంబం. ఇలాంటి స్థితిలో ఒక అమ్మాయి అథ్లెటిక్స్ గురించి ఆలోచించడం కష్టం. కానీ ఆటలపై ఉన్న ఆసక్తి సీమా కుమారిని ముందుకు తీసుకెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా రీటా గ్రామం ఆమె స్వస్థలం. స్పోర్ట్స్‌లో రాణించి జిల్లా స్థాయికి చేరడంతో ఆమె గురించి స్థానికులకు తెలిసింది. అప్పుడు ‘పరుగుల రాణి’ పీటీ ఉషతో పోలుస్తూ ‘చంబా’కీ రాణి అంటూ అందరూ పిలవడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్‌లో సీటు లభించడం ఆమె అథ్లెటిక్స్ కెరీర్‌కు పునాది వేసింది. 14 ఏళ్ల వయసులో రాంచీలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో సీమా అందరి దృష్టిలో పడింది. భారత అథ్లెటిక్స్‌లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ప్రాక్టీస్, క్రమశిక్షణ మాత్రమే కాకుండా ఫిట్‌నెస్ మన ఆటగాళ్ల స్థాయిని నిర్దేశిస్తాయి. మహిళల విభాగంలో అయితే మరింత కష్టంగా మారిపోతుంది. కానీ సీమా ఇక్కడే తన సత్తా చూపించింది. జూనియర్ స్థాయిలో 2 వేల మీటర్లు, 3 వేల మీటర్ల పరుగులో పలు జాతీయ రికార్డులు నెలకొల్పుతూ వచ్చి ఆపై సీనియర్ స్థాయిలో 5000 మీటర్లు, 10,000 మీటర్లకు అనుగుణంగా తన పరుగును మార్చుకుంది.
2017లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమె తల్లి తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి విత్‌డ్రా చేసి ఆమెను పంపించింది. ఇక్కడ సాధించిన కాంస్యం ఆమె భవిష్యత్తుకు పునాది వేసింది. 25 ఏళ్ల సీమా గత కొంత కాలంగా లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా నిలకడగా రాణిస్తూ భారత అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక చోటు సంపాదించుకుంది. 2026లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన సీమా... ఈ ఏడాదే 5 వేల మీటర్లు, 10 వేల మీటర్ల పరుగులో తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి ఆసియా క్రీడలకు సిద్ధమైంది. ఇప్పుడు గెలిచిన పతకం ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది.
పతకం అందించిన రోయింగ్...
గత నాలుగు ఆసియా క్రీడల నుంచి భారత్‌కు పతకాలు అందిస్తున్న రోయర్లు ఈసారి కూడా ఖాతా తెరిచారు. పురుషుల డబుల్స్ స్కల్స్ ఈవెంట్‌లో భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరు రేస్‌ను 6 నిమిషాల 13.25 సెకన్లలో పూర్తి చేశారు. ఆసియా క్రీడల ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం గమనార్హం.

తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న భారత జోడీ చివరి 500 మీటర్లలో వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైంది. యి యుది–నీ యిడ్ (చైనా; 6 నిమిషాల 09.77 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మెక్రోబెక్–సోరిన్ (ఉజ్బెకిస్తాన్; 6 నిమిషాల 10.49 సెకన్లు) ద్వయం రజతాన్ని అందుకుంది. సత్నామ్ గత ఆసియా క్రీడల్లో కూడా కాంస్యం గెలిచాడు.
ఫైనల్లో ఓటమితో...
వుషులో భారత ప్లేయర్ రోషిబీనా దేవి వరుసగా మూడో ఏషియాడ్‌లోనూ పతకం గెలుచుకుంది. అయితే ఫైనల్‌కు చేరి స్వర్ణంపై గురి పెట్టిన ఆమెకు తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. మహిళల 60 కేజీల ఫైనల్లో రోషిబీనా చైనాకు చెందిన జాంగ్ జియోయు చేతిలో 0–2తో పరాజయంపాలైంది. 


