తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు
మహబూబాబాద్ జిల్లాలో సగటున 8 సెం.మీ. వర్షం
ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ దంచికొట్టిన వాన
నేడూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం/భువనగిరి, నల్లగొండ అగ్రికల్చర్, భానుపురి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో సగటున 8 సెం.మీ. వర్షం కురిసింది. ఈ జిల్లాలోని ఇనుగుర్తిలో అత్యధికంగా 12.36 సెం.మీ. మేర వర్షం కురిసింది.
అలాగే ఖమ్మం జిల్లాలో సగటున 7.9 సెం.మీ., వరంగల్ జిల్లాలో 7.87 సెం.మీ., హనుమకొండ జిల్లాలో 7.82 సెం.మీ., జనగామ జిల్లాలో 7.79 సెం.మీ., కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో 4 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 3.38 సెం.మీ. సగటు వర్షం కురిసింది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్‌లో రెండో అతిపెద్ద వర్షమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలై 30న సగటున 3.6 సెం.మీ. మేర వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ మండలంలో 10.29 సెం.మీ. వర్షం కురవగా నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలో 6.94 సెం.మీ. వర్షం పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువు, బిక్కేరు వాగులోని చెక్‌డ్యాంలు అలుగు పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులకుగాను 19.9 అడుగులకు చేరుకుంది. అలాగే వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులను దాటి 18.5 అడుగులకు చేరింది. కొత్తగూడెం రీజియన్‌లోని గనుల్లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం కళింగపట్నం వద్ద తీరం దాటింది. గురువారం సాయంత్రానికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. శుక్రవారం నాటికి క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ సీజన్‌లో 16 శాతం లోటు
గురువారం నాటికి రాష్ట్రంలో నైరుతి రుతుపవన సీజన్ సాధారణ వర్షపాతం 71.41 సెం.మీ. మేర నమోదు కావాల్సి ఉండగా 60.16 సెం.మీ. వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా మరో 16 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మండలాలవారీగా పరిశీలిస్తే కేవలం ఒకే ఒక్క మండలంలో అతిభారీ వర్షం నమోదైంది. 45 మండలాల్లో అధిక, 268 మండలాల్లో సాధారణ వర్షపాతం, 306 మండలాల్లో లోటు, ఒక మండలంలో తీవ్రమైన లోటులో వర్షపాతం రికార్డయింది. సాధారణంగా నైరుతి సీజన్‌లో 10 సెం.మీ. వరకు వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వర్షాల నమోదు అంతంతమాత్రంగానే ఉంది.


