మరొకరితో వెళ్లిపోయేందుకు సిద్ధపడిందని.. | Incident in Kazipet Hanumakonda district | Sakshi
Sakshi News home page

మరొకరితో వెళ్లిపోయేందుకు సిద్ధపడిందని..

Sep 25 2026 5:30 AM | Updated on Sep 25 2026 5:30 AM

Incident in Kazipet Hanumakonda district

తల్లిని చంపిన కుమారుడు 

హనుమకొండ జిల్లా కాజీపేటలో ఘటన

కాజీపేట: ఆమెకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆమె ఆ వ్యక్తితో వెళ్లిపోయేందుకు సిద్ధపడడంతో తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందే కుమారుడు తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలాజీనగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన నాగుల ఉదయశ్రీ (40)కి హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో స్విగ్గీలో పనిచేస్తున్న రాజశేఖర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో రాజశేఖర్‌ ఆమెను ఇల్లు విడిచి తనతో రావాలని కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. రాజశేఖర్‌ రెండు రోజులుగా ఆమెకు ఫోన్‌చేసి హైదరాబాద్‌కు రావాలని, వస్తే పెళ్లి చేసుకుంటానని, రానిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడిని భరించలేక ఉదయశ్రీ గురువారం తాను హైదరాబాద్‌కు వెళ్తానని చెప్పగా భర్త, కుమార్తె, కుమారుడు ఇంటినుంచి వెళ్లొద్దంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ఆమె వినిపించుకోలేదని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కుమారుడు దొరబాబు కత్తితో తల్లిపై దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉదయశ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, రాజశేఖర్‌కు కూడా భార్య, పిల్లలు ఉన్నట్టు సమాచారం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు  
హత్య సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ ధార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ శ్యాంసుందర్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించడంతోపాటు కుటుంబ సభ్యులను విచారించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఉదయశ్రీ–రాజశేఖర్‌ మధ్య ఉన్న సంబంధంపై కూడా ఆరా తీస్తున్నారు. ఉదయశ్రీ సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement