సింగరేణి బకాయిలు చెల్లించి..విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించాలి | BRS dharna at Singareni headquarters in Lakdikapool | Sakshi
Sakshi News home page

సింగరేణి బకాయిలు చెల్లించి..విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించాలి

Sep 25 2026 5:51 AM | Updated on Sep 25 2026 5:51 AM

BRS dharna at Singareni headquarters in Lakdikapool

40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై విచారణకు డిమాండ్‌ 

సింగరేణి హెడ్‌ఆఫీస్, యాదాద్రి, కేటీపీఎస్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నిరసన 

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడం..థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా కాకపోవడమే కారణమని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు గురువారం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీజీబీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు లక్డీకాపూల్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎండీకి వినతిపత్రం అందజేశారు. 

సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023–24లో 700.2 లక్షల టన్నుల నుంచి 2025–26లో సుమారు 580 లక్షల టన్నులకు పడిపోయిందని, టీజీ జెన్‌కోకు కేటాయించిన దానికంటే తక్కువ బొగ్గు సరఫరా అవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. సింగరేణి నిల్వల్లో కనిపించకుండా పోయినట్టు ఆరోపణలు వచి్చన 40 లక్షల టన్నుల బొగ్గుపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కొప్పుల ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. దాని విలువ సుమారు రూ.1,600 కోట్లుగా పేర్కొంటూ, జూలై 3న విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినా నివేదిక ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం, దాని సంస్థల నుంచి రూ.51,500 కోట్లకుపైగా బకాయిలున్నాయని తెలిపారు. ఏడు రోజుల్లో రికార్డులు, వివరణలు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.  

కావాలనే విద్యుత్‌ ఉత్పత్తిని అడ్డుకుంటున్నారు : జగదీశ్‌రెడ్డి  
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్‌ సమస్య తీవ్రమైందని, యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో కూడా కావాలనే బొగ్గు కొరత సృష్టించి కరెంటు ఉత్పత్తిని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను ఉమ్మడి జిల్లా పరి«ధిలోని మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించి అక్కడి అధికారులతో పవర్‌ ప్లాంట్‌ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్‌ప్లాంట్‌ ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో విద్యుత్‌ సమస్య తీవ్రమైందని, పైర్లు ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు.  

» గణపురంలోని కేటీపీపీని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సందర్శించి బొగ్గు నిల్వలు, విద్యుదుత్పత్తిని పరిశీలించారు. విద్యుత్‌ కోతలు, బొగ్గు సరఫరాపై ప్రభుత్వాన్ని నిలదీశారు.  

» ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలోని కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారం సందర్శనకు ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, దిండిగాల రాజేందర్‌ తదితరులు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మణుగూరులోని బీటీపీఎస్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకోగా, ప్లాంట్‌ సీఈతో మాట్లాడారు. ఇద్దరినే అనుమతిస్తామని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నాయకులతో కలిసి ప్లాంట్‌ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ వచ్చాక రైతులకు నాణ్యమైన 8గంటల కరెంట్‌ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు 

» మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కోవ లక్షి్మ, అనిల్‌ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కొనప్ప, జాన్సన్‌ నాయక్, కౌశిక్‌హరి, రాజిరెడ్డి తదితరులు జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరేణికి జెన్‌కో రూ.52వేల కోట్లు బకాయిలు ఇవ్వలేదనే కంపెనీ బొగ్గు సరఫరా చేయడం లేదన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement