Photo Credit: BCCI Twitter
స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరువనంతపురం వేదికగా రెండు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఇరుజట్లు కేరళకు చేరుకొని ప్రాక్టీస్ ఆరంభించాయి. వెస్టిండీస్‌పై గెలిచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఓటమిని మరిచిపోవాలని టీమిండియా చూస్తుండగా, సొంతగడ్డపై భారత్‌కు షాకివ్వాలనే యోచనలో విండీస్ ఉంది.
రెండు జట్లు పేపర్‌పై బలంగా కనిపిస్తుండడంతో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఇదిలా ఉంటే, విండీస్‌తో సిరీస్ అనగానే టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగిపోతుంటాడు. గత గణాంకాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. 2018లో వెస్టిండీస్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించాడు.
2018లో ఆకాశమే హద్దుగా..
ఆనాటి సిరీస్‌ను భారత్ 3-1తో (ఒక మ్యాచ్ టై) గెలుచుకుంది. అయితే ఆ సిరీస్‌లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన ఐదు వన్డేల్లో కోహ్లి 453 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండడం విశేషం. ఈ మూడు సెంచరీలు మూడు వరుస మ్యాచ్‌ల్లో రావడం విశేషం. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లి (107 బంతుల్లో 140 నాటౌట్) విజృంభించడంతో భారత్ సునాయాస విజయం సాధించింది.
ఇక రెండో వన్డేలో కోహ్లి 129 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ టైగా ముగియడం గమనార్హం. ఇక మూడో వన్డేలో మరోసారి సెంచరీతో చెలరేగిన కోహ్లి 119 బంతుల్లో 107 పరుగులు చేశాడు. మూడు వరుస వన్డేల్లో శతకాలు సాధించిన తొలి బ్యాటర్‌గానూ కోహ్లి అప్పట్లో రికార్డులకెక్కాడు.
బాబర్ ఆజం మాత్రమే..
ఆ తర్వాత రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించి కోహ్లి సరసన చేరాడు. ఇక కోహ్లి తర్వాత వెస్టిండీస్‌పై వరుసగా మూడు వన్డేల్లో సెంచరీలు బాదిన క్రికెటర్‌గా పాకిస్తాన్ బాబర్ ఆజం ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకున్నా కోహ్లికి విండీస్‌పై ఘనమైన రికార్డు ఉంది. వన్డే క్రికెట్‌లో కోహ్లి 41 ఇన్నింగ్స్‌ల్లో 97 స్ట్రైక్‌రేట్‌తో 2,261 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇక కెప్టెన్‌గా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. 2018లో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లి 558 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో ఆసీస్ కెప్టెన్ జార్జ్ బెయిలీ (478 పరుగులు, భారత్‌పై 2013లో) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మరోసారి కోహ్లి (453 పరుగులు వర్సెస్ వెస్టిండీస్‌పై) ఉన్నాడు. ఇక వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో కోహ్లి మినహా ఏ బ్యాటర్ కూడా 400 పరుగుల మార్క్‌ను దాటలేకపోవడం గమనార్హం.
తిరువనంతపురంలో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ కోసం ఇప్పటికే కోహ్లీ అక్కడికి చేరుకుని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన సహచరుడు రోహిత్ శర్మతో కలిసి కోహ్లి తిరిగి జట్టులోకి రావడంతో, ఈ సిరీస్ భారత్ గడ్డపై అభిమానులకు అసలైన 'మాస్ వినోదాన్ని' అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం!


