సాక్షి,హైదరాబాద్: గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి 26వ తేదీ శనివారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రోరైళ్లను నడుపనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రయాణికుల రద్దీకనుగుణంగా నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్‌బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌ల నుంచి ఆఖరు సర్వీసులు అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరనున్నాయి. అలాగే నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని మెట్రో స్టేషన్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకాఫూల్, అమీర్‌పేట్, తదితర స్టేషన్‌లలో అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


