సచివాలయ ఉద్యోగులపై దాడులా?.. పోలీసుల తీరు దుర్మార్గం: బొత్స | YSRCP MLC Botsa Satyanarayana Seroius Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై దాడులా?.. పోలీసుల తీరు దుర్మార్గం: బొత్స

Sep 28 2026 12:56 PM | Updated on Sep 28 2026 1:17 PM

YSRCP MLC Botsa Satyanarayana Seroius Comments On CBN Govt

సాక్షి, విజయనగరం: ఏపీలో సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. మహిళలపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్సార్‌సీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ విజయవంతంగా నడిచింది. దేశం మెచ్చే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రయత్నం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోంది. మహిళలపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. వందలాది మంది సచివాలయ ఉద్యోగులను నిర్భంధించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు ఏపీ కోరలేదు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

మొన్నటి వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వంలో చలనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకున్నాం. రైతులకు నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి అండగా నిలిచాం​. ఏ ఒక్క రైతుకైనా కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది?. అరటి, బొప్పాయి, మొక్క జొన్న, వరి పంటలు నాశనం అయ్యాయి. ఇన్సూరెన్స్ లేదు. కొత్త విధానం తెచ్చాము అన్నారు. ఏదీ ఆ విధానం? అని ప్రశ్నించారు. 

ఈ రెండున్నర ఏళ్లలో రైతులకు జరిగిన నష్ట పరిహారం ఇవ్వాలి. మొక్కుబడిగా కాదు. సక్రమంగా ఇవ్వాలి. అరటి, బొప్పాయి పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. మొక్క జొన్నకు 50 వేలు అవుతుంది. ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం ప్రకటించాలి. పరిపాలన గాలికి వదిలేసారు. ఒక్క పోలీస్ స్టేషన్‌లో తప్ప ఎక్కడా ఆక్టివిటీ లేదు. పోలీస్ స్టేషన్‌లలో అన్నీ సెటిల్‌మెంట్స్‌ జరుగుతున్నాయి. పరిపాలన అంటే పోలీస్ వ్యవస్థ కాదు. పోలీస్ అధికారులు దిగువ స్థాయి వారికి సూచనలు ఇవ్వండి. మళ్ళీ బ్రిటిష్ పాలన తీరును తీసుకురండి. ఇది మంచి విధానం కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇదీ చదవండి: రేపు ఒంగోలుకు వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement