ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా కేసుల రూపంలో షాక్ తగిలింది. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులపై పోలీసు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పోలీసుల దౌర్జన్యంగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనే ఇప్పుడు కేసులు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే కారణంతో సత్యనారాయణపురం పోలీసులు 46 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. న్యాయబద్ధమైన తమ డిమాండ్లు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొంతకాలంగా తమ విధులు, పని భారం, సేవా సంబంధిత అంశాలపై పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లపైనా కేసులు నమోదు కావడంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది.
చలో విజయవాడలో పాల్గొన్నందుకు కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలపై నిరసన తెలిపిన ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: నాదీ హామీ.. న్యాయం చేసి తీరతాం: వైఎస్ జగన్


