సర్కారుకు షాక్‌ | Secretariat employees made the protest a success | Sakshi
Sakshi News home page

సర్కారుకు షాక్‌

Sep 28 2026 4:10 AM | Updated on Sep 28 2026 4:24 AM

Secretariat employees made the protest a success

అడ్డంకులు, అరెస్టులు, సస్పెన్షన్లు, బెదిరింపులను దాటుకుని రావడం వెనుక వ్యూహం 

ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ధర్నా.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్‌ 

తొలుత ధర్నా చౌక్‌కు చేరుకున్న వారికి ఎదురైన పరిస్థితులపై తర్వాత వచ్చేవారికి సూచనలు.. ఎక్కడికి ఎలా ఎప్పుడు రావాలనే పక్కా ప్లానింగ్‌.. అది విఫలమైతే ప్లాన్‌–బి సిద్ధం

అందరూ ఆశ్చర్యపోయేలా ధర్నాను విజయవంతం చేసిన సచివాలయ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: హక్కుల కోసం.. ఆత్మగౌరవం కోసం శాంతియుతంగా జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ఉక్కుపాదం మోపింది. ప్రొబేషన్‌ డిక్లరేషన్, ప్రమోషన్‌ ఛానల్, సీనియారిటీ తదితర సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. రెండేళ్ల ఇంక్రిమెంట్, వేతన బకాయిలు, కనీస మూల వేతనం పెంపు, జీఓ నంబర్‌ 11 రద్దు వంటి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 

ఆదివారం, సెలవు రోజుల్లో బలవంతంగా తమ చేత పని చేయించవద్దని కోరుతున్నారు. వీటిని సాధించుకోవడం కోసం ఇన్నాళ్లూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మంత్రి నుంచి అధికారుల వరకూ ఎంత మందికి ఎన్ని వినతులు ఇచ్చినా, చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదు. చివరికి విసిగిపోయి ఆందోళనకు సిద్ధమయ్యారు. కానీ అడ్డంకులను దాటుకుని వేలాదిగా తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పారు. దాంతో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆదివారం ఖాకీ దళాలు దౌర్జన్యకాండకు తెగబడ్డాయి. 

బీటెక్, ఎంటెక్, ఏంబీఏ, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివి, సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఉద్యోగులను నేరస్థుల్లా, టెర్రరిస్టుల్లా చూశారు. శాంతియుతంగా నిరసన తెలపాలని వచ్చిన వారిని చితక్కొట్టారు. మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. మగ పోలీసులే మహిళల జుత్తు పట్టుకుని ఈడ్చి పడేశారు. దుస్తులు చించి అవమానించారు. అసలు తమను ఎందుకు కొడుతున్నారో తెలియక, కొడుతున్న వారు కూడా సాటి ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారెందుకు తమపై విరుచుకు పడుతున్నారో అర్థం కాక సచివాలయ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

ఒంటి మీద లాఠీ దెబ్బలు ఎక్కడబడితే అక్కడ తగులుతుంటే గావు గేకలు పెట్టారు. పోలీసు వ్యాన్లలో పశువుల్లా కుక్కి వారిని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అక్కడ గదుల్లో లోపలపెట్టి స్టేషన్‌కు తాళాలు వేసి, తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వకుండా నిర్బంధించారు. సమస్యలు విన్నవించుకోవడం కోసం ధర్నా చేపడితే, దానిని రణరంగంగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దమననీతిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎంతగా అణచి వేయాలని చూసినా, వెనక్కి తగ్గేది లేదంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఒక వైపు ఉద్యోగులను పోలీసులు నిలువరిస్తే, మరోవైపు నుంచి భారీ సమూహంలా వచ్చి, అడ్డుగోడలు బద్దలు కొట్టారు. 

నిర్బంధాలను పటాపంచలు చేసి..
ప్రభుత్వం విధించిన ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు, ముందస్తు నిర్బంధాల మధ్య కూడా సచివాలయ ఉద్యోగులు సోషల్‌ మీడియా ఆధారంగా పరస్పర సమాచారాన్ని పంచుకుంటూ అత్యధికంగా విజయవాడ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో ‘ఛలో విజయవాడ’ ఊహించని రీతిలో విజయవంతం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

జిల్లాల్లోనూ ఉద్యోగులను అడ్డుకునే చర్యలు చేపట్టినప్పటికీ వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. దీని వెనుక జెన్‌జీ యువత మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. ప్రణాళికలో భాగంగా.. విజయవాడకు కొందరు రెండు రోజుల ముందే వచ్చేశారు. ఎవరు వస్తున్నారనే దానిపై సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయ సేకరణ  వంటివి చేపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల నుంచి ఎలా చేరుకోవాలన్న దానిపై గ్రూపుల్లో సమాచారం పంచుకున్నారు.. ఒక మార్గంలో అడ్డంకులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునేలా ముందుగానే ప్లాన్‌–బి (ప్రణాళిక) రూపొందించుకున్నారు.

సోషల్‌ మీడియానే సమాచార వేదిక 
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్‌ వంటి వేదికలను సచివాలయ ఉద్యోగులు విస్తృతంగా ఉపయోగించారు. ఎక్కడ పోలీసులు అడ్డుకున్నారు? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? విజయవాడలో ఎక్కడికి చేరుకోవాలి? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెనుక వస్తున్న వారికి చేరవేశారు. బస్సుల్లో, రైళ్లలో వస్తున్న వారు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వరకు చేరుకోకుండానే ముందు స్టేజీల్లో ఎక్కడ దిగాలనేదానిపై సూచనలు చేశారు. పోలీసుల నిర్బంధానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ భావోద్వేగపూరిత పోస్టులు కూడా విస్తృతంగా షేర్‌ చేశారు. అవి మరింతగా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి.

ఎక్కడ అడ్డుకుంటే అక్కడే..
ముందు రోజు రాత్రి రైళ్లు, బస్సుల్లో వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దించి, వారిని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. వందలాదిగా వస్తున్న వారిని వెనక్కి వెళ్లిపొమ్మంటూ అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే తమ గళాన్ని వినిపించారు. తమ హక్కుల కోసం నినదించారు. ఆ దృశ్యాలను వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

భయపెట్టలేని ముందస్తు అరెస్టులు.. సస్పెన్షన్లు
ఛలో విజయవాడకు ముందు నుంచే ఉద్యోగులపై నిఘా, ముందస్తు నిర్బంధాలు, అరెస్టులు చేపట్టారు. తెల్ల కాగితాలపై వారి చేత సంతకాలు చేయించుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ముఖ్య నేతలను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఛలో విజయవాడకు సంబంధించిన సోషల్‌ మీడియా కార్యకలాపాలను సైతం నియంత్రించారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిం చారు. ఉద్యోగులను ఏమార్చే ప్రయత్నం చేశారు. 

ఉద్యమంలో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్లు, కమిషనర్లు హెచ్చరించారు. అయినా అవేవీ ఉద్యోగులను భయపెట్టలేకపోయాయి. ఢిల్లీని వణికించిన ‘కాక్రోచ్‌’ తిరుగుబాటుకు కొనసాగింపుగా అన్నట్లు ఏపీలో కదంతొక్కిన జెన్‌ జీ యువతరం మరోసారి స్వాతంత్రోద్యమంలో ‘స్టూడెంట్‌ మూమెంట్‌’ను గుర్తుచేసింది. రాత్రయినా ఏమాత్రం ఉద్యమ స్ఫూర్తిని కోల్పోకుండా సెల్‌ఫోన్‌ వెలుగులోనే ఆందోళన కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చాటిచెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement