ఉద్యోగులపై ఇంత కర్కశత్వమా? | Venkatrami Reddy on Police assault on Village and Ward Secretariat employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై ఇంత కర్కశత్వమా?

Sep 28 2026 4:04 AM | Updated on Sep 28 2026 4:04 AM

Venkatrami Reddy on Police assault on Village and Ward Secretariat employees

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడి దుర్మార్గం  

మహిళా ఉద్యోగులను బస్సులో వేసి పిడిగుద్దులు గుద్దుతారా?  

ఆదివారం ధర్నాకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే సహించం 

స్థానికసంస్థల ఎన్నికలలో తడాఖా చూపుతాం  

ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి  

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి విజయవాడ ధర్నా చౌక్‌కు వస్తే వారిపై పోలీసులతో దాడిచేయించటం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. న్యాయమైన కోర్కెలపై ధర్నా చేస్తున్న మహిళా ఉద్యోగులను రోడ్డు మీద ఈడ్చుకొంటూ లాక్కుపోవటం అమానుషమన్నారు. ‘లాక్కెళ్లిన మహిళా ఉద్యోగులను బస్సుల్లో వేసి పిడిగుద్దులు గుద్ది గాయపరుస్తారా? ఉద్యోగులపై లాఠీఛార్జ్‌ చేయించడం అత్యంత దారుణం. 

మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధిస్తారా? ఉద్యోగులను గౌరవంగా చూసుకోవటమంటే ఇదేనా చంద్రబాబూ..? తమకు ఇచ్చిన హామీల గురించి ఉద్యోగులు ప్రశ్నిస్తే డిస్మిస్‌ చేస్తారు. లాఠీలతో కొట్టిస్తారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధిస్తారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా? ఉద్యోగులపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? వందల మందిని అరెస్టు చేశారు. వారికి సంఘీభావం తెలపడానికి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మమ్మల్ని అడ్డుకున్నారు. తీసుకెళ్లిన భోజనాలను కూడా వారికి ఇవ్వనీయలేదు. 

అక్రమంగా నిర్బంధించిన వందలాది మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే చర్చలు జరపాల్సింది పోయి, డీజీపీ స్థాయి నుంచి ఎస్పీలకు ఆదేశాలిచ్చి ఉద్యోగులు రాకుండా అడ్డుకుంటారా? ఇదేమైనా నియంతృత్వ రాజ్యమా? పోలీస్‌స్టేషన్లకు తరలించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే సహించబోం’ అని చెప్పారు. పోలీసులూ.. మీ తోటి ఉద్యోగులపై కర్కశంగా వ్యవహరించవద్దు అని సూచించారు. 

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేసిన ధర్నా సక్సెస్‌ అయింది. వారి ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నామన్నారు. ఉద్యోగులకు అడుగడుగునా అండగా ఉంటామని చెప్పారు. అధైర్యపడొద్దని సూచించారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సినవాటిని దసరా లోపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న స్థానికసంస్థల 
ఎన్నికల్లో తడాఖా చూపుతామని హెచ్చరించారు.  

గ్రామ సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధిస్తున్నారా?  
‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన వ్యవస్థ కాబట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధిస్తున్నారా? హార్ట్‌ ఎటాక్‌తో చిన్న వయసులోనే ఉద్యోగులు చనిపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం వేధింపులు, పని ఒత్తిడే. చిన్నచిన్న ఉద్యోగుల మీద ఈ స్థాయి ఒత్తిడి అవసరమా? రోజుకొక సర్వే పెట్టి వేధిస్తున్నారు. యోగాంధ్ర అనగానే సచివాలయ ఉద్యోగులనే యోగా గురువుల అవతారం ఎత్తిస్తున్నారు. పీ4 అనగానే కుటుంబాల దత్తత... అంటూ సచివాలయ ఉద్యోగులను తిప్పుతున్నారు. ఉత్సవాలు జరిగితే టాయిలెట్ల దగ్గర కాపలా పెడుతున్నారు. పెట్రోలు కొరత రాగానే బంకుల దగ్గర కాపలా పెడుతున్నారు. 

ఇలా ప్రతిదీ వారికే అప్పగించి వేధిస్తున్నారు. పండుగలు, ఆదివారాలు కూడా లేకుండా అడ్డమైన పనులు చేయిస్తున్నారు. ఆఫీసులో లేకుండా రోడ్లవెంట తిప్పుతున్నారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించటం దుర్మార్గం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత టార్చర్‌ పెట్టలేదు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మందులు, ఆహారం, ప్రభుత్వ సేవలు చేరవేయడంలో సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేసింది.

ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయడం నుంచి సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల వరకు సచివాలయ ఉద్యోగులే ముందుండి పనిచేస్తున్నారు. అలాంటి వ్యవస్థను కుదించి ఉద్యోగులపై మరింత పనిభారం మోపడం సరికాదు. 15,004 సచివాలయాలను 7,715కు కుదించే చర్యలపై ప్రభుత్వం పునరాలోచించాలి. ఉద్యోగులను అణచివేయడం కాదు.. వారితో చర్చించి సమస్యలను పరిష్కరించాలి’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల పక్షాన రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ధర్నా సందర్భంగా బందోబస్తు డ్యూటీలో ఉన్న సీఐ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్యోగుల ధర్నా జరగకుండా అణచివేయాలనే ప్రభుత్వ నిరంకుశ ధోరణి వల్లే సీఐ మృతి చెందారని ఆయన పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement